
పెళ్లంటే..పందిళ్లు, చప్పట్లు, తాళాలు, మేళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు.. ఈ వేద మంత్రాలు తమ కోసమే మొగాలని కోరుకొని వారంటు ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి హీరోయిన్స్ కి కూడా ఆ ఆశ ఉంటుందనేది నిజం. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కథానాయికలు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసేవారు.
కానీ మారుతున్న కాలంతో పాటు సమాజంలో, అలాగే సినీ వర్గాల్లో మహిళల ఆలోచనా విధానంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. నేటి తరం నటీమణులు పెళ్లి పట్ల తమకున్న వ్యక్తిగత దృక్పథాన్ని చాలా స్పష్టంగా, నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు. సినీ రంగానికి చెందిన చాలా మంది సౌత్ హీరోయిన్లు వివాహ బంధానికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపుతుండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత కాళ్లపై నిలబడటం, వృత్తిపరమైన స్వేచ్ఛ, మానసిక ప్రశాంతతకే ప్రాధాన్యత ఇస్తూ చాలా మంది భామలు వివాహ వ్యవస్థకు స్పష్టంగా "నో" అని చెప్తున్నారు. తాజాగా నటి అంజలి చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చాయి. "కేవలం నా స్నేహితులు, సన్నిహితులు లేదా కుటుంబ సభ్యుల ఆనందం కోసం నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది?" అని అంజలి చాలా సూటిగా ప్రశ్నించింది. పెళ్లి అయిన కొత్తలో అందరూ చుట్టూ ఉన్నా, కాలక్రమంలో ఎవరి దారి వారు చూసుకుని వెళ్లిపోతారని, చివరకు తాను ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందని ఆమె సరదాగా చెబుతూనే నిత్యసత్యాన్ని వ్యాఖ్యానించింది. తన ఇంట్లో కూడా ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురావడం లేదని, ప్రస్తుతం తానెంతో సంతోషంగా ఉన్నానని ఆమె స్పష్టం చేసింది. కేవలం అంజలి మాత్రమే కాదు, మరో ప్రముఖ నటి శ్రుతిహాసన్ కూడా పెళ్లి పట్ల తన వైఖరిని గతంలోనే ఓపెన్‌గా వెల్లడించింది.
తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, కానీ సాంప్రదాయ పెళ్లి బంధంపై మాత్రం అసలు ఆసక్తి లేదని కమల్ హాసన్ తనయ శ్రుతిహాసన్ తెగేసి చెప్పింది. అసలు పెళ్లి అనే ఒక చట్టబద్ధమైన ముద్ర లేకుండానే ఒక జీవిత భాగస్వామితో కలిసి హాయిగా, సంతోషంగా జీవించవచ్చని ఆమె అభిప్రాయపడింది. వ్యక్తిగత స్వేచ్ఛకు, స్వతంత్ర ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే శ్రుతిహాసన్ వ్యాఖ్యలు నేటి ఆధునిక ఆలోచనా విధానానికి అద్దం పడుతున్నాయి.

మరో వైపు తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లక్ష్మీ మీనన్ కూడా పెళ్లికి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. పెళ్లి చేసుకోవడం మాత్రమే ఒక వ్యక్తికి పరిపూర్ణమైన లేదా సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తుందనే నమ్మకం తనకు లేదని లక్ష్మీ మీనన్ తేల్చి చెప్పింది. ఈ విషయంపై తనకు కొంతకాలం క్రితమే స్పష్టమైన అవగాహన వచ్చిందని, భవిష్యత్తులో కూడా పెళ్లి విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆమె పునరుద్ఘాటించింది. ఇక సౌత్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా అగ్ర కథానాయికలుగా ఏలుతున్న అనుష్క శెట్టి, త్రిష, నిత్యామీనన్ వంటి నటీమణులు కూడా ప్రస్తుతం వివాహ బంధానికి దూరంగానే ఉంటున్నారు. ముఖ్యంగా జాతీయ అవార్డు గ్రహీత నిత్యామీనన్ ఒంటరి జీవితమే తనకు ఎనలేని సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తోందని ఇప్పటికే అనేక వేదికలపై బహిరంగంగానే చెప్పింది. వయసు పెరుగుతోందనో, సమాజం ఒత్తిడి తెస్తోందనో పెళ్లిళ్లు చేసుకోకుండా, తమ జీవితంపై పూర్తి నియంత్రణ సాధిస్తూ తమకు నచ్చిన రీతిలోనే వీరంతా జీవిస్తున్నారు. ఒకపక్క స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులలో నటిస్తూ, మరోపక్క సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామల స్టాండ్ సినీ వర్గాల్లోనూ, ఫ్యాన్స్‌లోను నయా ట్రెండ్‌గా మారుతోంది. దీంతో సోలోగా అందమైన లైఫ్ అనుభవిస్తున్న సినీ టైంని ఎంజాయ్ చేయడానికే అనే మాటలు సినీ ప్రియుల నుంచి వినపడుతున్నాయి.
[Film Actresses Saying No Marriage South, Anushka, Trisha, anjali, Shruthi Haasan, Nithya Menon, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






