
హాస్యం.. నవ్వు.. లాఫింగ్..ఈ మూడు పదాల అర్ధం ఒకటే. కానీ ఎందుకు విడిగా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈవివి సత్యనారాయణ అనే దర్శక హాస్య చక్రవర్తి సృషించిన నవ్వుల సినీ ప్రపంచం. ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు పొట్టచెక్కలయేలా నవ్వి, నవ్వుకి ఆ పైన చెప్పుకునే మూడు పదాలు ఉండేవని అనుకునే వారు. చనిపోయిన శవం ముందు ఏడుస్తూ ఉన్న వాళ్ళకి ఆయన సినిమా చూపిస్తే చాలు నవ్వుతూనే ఉంటారు. అసలు ఆయన హవా సాగుతున్న రోజుల్లో బీపీ షుగర్ పేషేంట్ లు దొరక్క డాక్టర్స్ అల్లలాడారనే మాట కూడా వినిపిస్తూ ఉండేది .
తెలుగు సినిమా చరిత్ర పుటలని ఒకసారి తిరగేస్తే, ప్రేక్షకులని థియేటర్లలో కడుపుబ్బ నవ్వించిన దర్శకులు కొందరే కనిపిస్తారు.90లలో ఆయన చూపించిన దర్శకత్వ ప్రతిభ, హాస్య చతురత తెలుగు సినీ రంగాన్ని ఊపేశాయి. నేటికీ తెలుగు సినీ పరిశ్రమలో "మళ్లీ ఇంకో ఈవీవీ సత్యనారాయణ పుడతారా?" అనే ప్రశ్న వస్తే, ఖచ్చితంగా లేదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే, సెల్యులాయిడ్ పై ఆయన సృష్టించిన నవ్వుల ప్రభంజనం, కామెడీ టైమింగ్, సరికొత్త శైలి కలకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి.
'ఆ ఒక్కటీ అడక్కు', 'జంబలకిడిపంబ', 'అలిబాబా అరడజను దొంగలు', 'కితకితలు', చాలా బాగుంది, సీతారత్నం గారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, హలో బ్రదర్, బెండు అప్పారావు వంటి చిత్రాలు తెలుగు హాస్య సినిమాలకి కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. పేరుకి ఆ పేర్లు చెప్పుకుంటాం గాని ప్రతి సినిమాలోను కామెడి ఒక రేంజ్ లో ఉండేది ముఖ్యంగా 1993లో విడుదలైన 'జంబలకిడిపంబ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 500 శాతానికి పైగా లాభాలను తెచ్చిపెట్టి, నాటి రోజుల్లోనే కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. మగవారు ఆడవారిలా, ఆడవారు మగవారిలా ప్రవర్తించే వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా మలచడం కేవలం ఈవీవీకే చెల్లింది. ఈ ఒక్క సినిమాతోనే ఆయన హాస్య సామ్రాజ్యానికి తిరుగులేని రాజుగా ముద్ర వేసుకున్నారు.
ఈవీవీ సత్యనారాయణ ప్రత్యేకత కేవలం స్వచ్ఛమైన కామెడీ సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనకు ఉన్న అతిపెద్ద బలం ఏంటంటే... అత్యంత తీవ్రమైన, ఆందోళనకరమైన సిరియస్ సీన్లలో కూడా ఊహించని విధంగా కామెడీని పండించడం. సాధారణంగా ఒక సెంటిమెంట్ లేదా యాక్షన్ సీన్ నడుస్తున్నప్పుడు ప్రేక్షకులు గంభీరంగా మారతారు. కానీ ఈవీవీ తనదైన మార్కు హాస్య సంభాషణలతో, క్యారెక్టర్ ఆర్టిస్టుల టైమింగ్‌తో ఆ సన్నివేశం యొక్క బరువు తగ్గకుండానే ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేవారు. సెంటిమెంట్ ఎంతగా పండిందో, దానికి సమాంతరంగా కామెడీ కూడా అంతేస్థాయిలో విజయం సాధించింది. సెంటిమెంట్, కామెడీ రెండింటినీ సరిసమాన నిష్పత్తిలో కలిపి 100 శాతం వినోదాన్ని పంచడం ఆయనకే సాధ్యమైంది.

ఇది కూడా చదవండి: NTR: ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమా రాబోతుందా? నిజమెంత?
తన సినీ జీవితంలో 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈవీవీ, రాజేంద్రప్రసాద్, నరేష్, శ్రీకాంత్, జగపతిబాబు వంటి ఎంతోమంది నటులకు బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చారు. అంతేకాకుండా, తన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లను ఇండస్ట్రీకి పరిచయం చేసి విజయం సాధించారు. ఒక్కరి మాత్రం నిజం ఏంటంటే ప్రతి తెలుగింట నవ్వుల పువ్వులు పూయించిన ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకుడు మళ్లీ పుట్టడం అసాధ్యం. ఆయన జ్ఞాపకాలు, ఆయనందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. చావు తాను గెలిచానని అనుకోవచ్చు. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే ప్రతి నిమిషం ఈవివి పేరు గుర్తుచేసుకుంటూ ఆయన సినిమాలు చూస్తూ నవ్వుల జడివానలో మునిగిపోని తెలుగు వాడు లేడు.
[Evv Satyanarayana Telugu Cinema Legend, EVV Satyanarayana, EVV Satyanarayana Telugu Movies, EVV Satyanarayana Comedy Scenes, Jambalakidi Pamba Director,Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]






