Home

»

Latest News

Dhurandhar 2: కొండను ఢీ కొడుతున్న పొట్టేళ్లు.. 'ధురంధర్ 2' వేవ్‌లో ఈ సినిమాలు నిలబడతాయా?

Mar 23, 2026

బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం 'ధురంధర్ 2'(Dhurandhar 2) ప్రభంజనం సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా గట్టి ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 26న థియేటర్లలోకి రాబోతున్న చిన్న సినిమాలకు ఈ 'ధురంధర్' వేవ్ పెద్ద సవాల్‌గా మారింది.

టాలీవుడ్ నుంచి మార్చి 26న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ‘బ్యాండ్ మేళం’, మార్చి 27న ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘సుయోధన’ విడుదల కానున్నాయి. ఈ వారం డబ్బింగ్ సినిమాల సందడి కూడా ఉంది. మార్చి 26న 'యూత్', మార్చి 27న 'హ్యాపీ రాజ్' థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి.

సమ్మర్ సీజన్ లో సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే పలు చిన్న సినిమాలు మార్చి చివరి వారంపై కన్నేశాయి. అయితే, ఇప్పుడు నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా.. ఊహించని విధంగా 'ధురంధర్ 2' వసూళ్ల సునామీ కొనసాగుతుండటంతో థియేటర్ల కేటాయింపులు, ప్రేక్షకుల ఆదరణపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా 'ధురంధర్ 2'కి తెలుగులోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. దానికితోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ వారం విడుదలయ్యే సినిమాలకు మౌత్ టాక్ చాలా కీలకం కానుంది. కంటెంట్ ఓ రేంజ్ లో ఉందనే టాక్ వస్తే తప్ప.. చిన్న సినిమాల వైపు ప్రేక్షకులు చూసే పరిస్థితి ఉండదు.

'ధురంధర్ 2' వేవ్‌ లో తమ సినిమాలను విడుదల చేయడం కరెక్ట్ కాదని కొందరు మేకర్స్ భావిస్తారు. ఈ క్రమంలోనే మార్చి 26న విడుదల కావాల్సిన సుడిగాలి సుధీర్ 'GOAT' సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం.

మొత్తానికి మార్చి ఆఖరి వారం బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికర పోరు చూడబోతున్నాం. మరి 'ధురంధర్ 2' తన జోరును ఇలాగే కొనసాగిస్తుందా? లేక కొత్తగా వచ్చే చిన్న సినిమాలు ఏమైనా సర్ ప్రైజ్ చేస్తాయా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com