Home

»

Latest News

ధనుష్ మాస్ జాతర షురూ..  ‘ఓం’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.! 

Jul 29, 2026 11:41AM

వర్సటైల్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 55వ చిత్రం 'ఓం' నుండి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ 'అలాకా లూవా' విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎనర్జిటిక్ సెలబ్రేషన్ ఆంథమ్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ధనుష్ సరసన ఊరమాస్ డ్యాన్స్ మూమెంట్స్, దద్దరిల్లిపోయే బీట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ పాట ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసే విధంగా రూపొందించిన ఈ సింగిల్ సినిమాపై ఉన్న భారీ అంచనాలను మరింత పెంచేసింది.

ఈ విజువల్ అండ్ మ్యూజికల్ ఫీస్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చడం విశేషం. పాటను అత్యంత శక్తివంతంగా ట్యూన్ చేయడమే కాకుండా సాయి అభ్యంకర్ స్వయంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఇక తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గాయకులు రామ్ మిరియాల, అరుణ్ కౌండిన్య తమ గొంతు కలపడంతో ఈ పాటలో మరింత జోష్ నిండింది. ఆస్కార్ విజేత, ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ అందించిన సాహిత్యం మాస్ పల్స్‌ను కచ్చితంగా పట్టుకుంది. ఇక ఈ పాటలో ధనుష్ వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పాట ముగిసేవరకు ఆయన చూపించిన ఈజ్, గ్రేస్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన 'ఫస్ట్ స్ట్రైక్' టైటిల్ టీజర్ కూడా నెట్టింట విశేషమైన స్పందన రాబట్టుకున్న సంగతి తెలిసిందే. 'ఓం – చాప్టర్ 1: ఉధిరమ్- ది బ్లడ్ వుడ్' అనే పూర్తి టైటిల్‌తో వచ్చిన ఈ టీజర్ సినిమా ఎంతటి తీవ్రమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందో స్పష్టం చేసింది. ఈ టీజర్‌లో ధనుష్ చూపించిన రౌద్రం, మాస్ అవతార్ తో పాటు విజువల్ క్వాలిటీ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. కేవలం పోస్టర్లు, టీజర్‌లతోనే కాకుండా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ 'అలాకా లూవా'తో సినిమా ప్రమోషన్స్ హోరెత్తిపోతున్నాయి.

సినిమాకు సంబంధించి ప్రకటించిన భారీ తారాగణం సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఊహించని రేంజ్‌లో అంచనాలను పెంచేసింది. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక అత్యంత శక్తివంతమైన, కీలకమైన పాత్రలో నటిస్తుండటం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. అంతేకాకుండా 'మారి 2' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కాంబినేషన్ తర్వాత ధనుష్ మరియు సాయి పల్లవి మరోసారి ఈ చిత్రంతో జతకడుతున్నారు. వీరి కాంబోలోని కెమిస్ట్రీ కోసం ప్రేక్షకులు కాతురతగా ఎదురుచూస్తున్నారు. అలాగే నేటితరం క్రేజీ కథానాయకి శ్రీలీల కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ పోషిస్తుండటంతో ఈ గ్లామర్, యాక్షన్ కాంబినేషన్ పాన్-ఇండియా స్థాయిలో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

'అమరన్' వంటి సంచలన బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని జోరుమీదున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్‌తో పాటు ఆర్-టేక్ స్టూడియోస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 16న విజయదశమి పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అద్భుతమైన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల కలయికతో వస్తున్న 'ఓం' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

 

Dhanush Om movie, Alaka Luva song released, Dhanush 55th film Om, Rajkumar Periasamy Dhanush, Sai Pallavi Sreeleela Om, Dhanush Om first single

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com