Home

»

Latest News

కారు మెకానిక్‌తో కూతురు లవ్.. వెంకీ మామ ఫుల్ ఫన్.!

Jul 29, 2026 11:43AM

విక్టరీ వెంకటేష్ ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’గా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందిన తర్వాత, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ చిత్ర బృందం కుటుంబంలోని మరో సభ్యురాలిని పరిచయం చేసింది.

ఈ చిత్రంలో చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుంది. ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం తెలిపింది.

'సంపూర్ణ'గా యువినా పార్థవి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ లో.. త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి.. ఆ రిజిస్ట్రేషన్ చేసేసి, మీ కమిషన్ మీకు ఇచ్చేసానంటే.. హిందూ పేపర్ చదువుకుంటూ రిటైర్డ్ తెలుగు టీచర్ లాగా లుంగీ నలకుండా బతికేస్తా" అంటూ వెంకటేష్ చెప్పే మార్క్ డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వెంకీ మార్కు నటన, ఆయన టైమింగ్ ప్రేక్షకులకు పాత రోజులను మళ్లీ గుర్తుచేసేలా ఉన్నాయి.

ఈ ప్రోమోలో తండ్రీకూతుళ్ల మధ్య సాగే సంభాషణ ఎంతో సరదాగా సాగింది. "నాన్న ఐ యమ్ ఇన్ లవ్" అని సంపూర్ణ చెప్పగానే.. "ఛీ దీనబ్బా.. ఈసారి ఎవడే? కార్ మెకానికా? అసలు నీ వయస్సుకి లవ్ అంటే మీనింగ్ తెలుసా?" అని తండ్రి పాత్రలో వెంకటేష్ క్లాస్ పీకే ప్రయత్నం చేస్తారు. దానికి సమాధానంగా ఆ చిన్నారి "నాకేమవుతుందో అనే బాధ కన్నా, వాడికేమవుతుందో అనే భయం ఎక్కువ అయితే.. అదే ప్రేమ" అంటూ చాలా అమాయకంగానే త్రివిక్రమ్ శైలిలో చెప్తుంది.

పాత్రల పరిచయాలతో సినిమాపై రోజురోజుకూ ఆసక్తిని పెంచుతున్న మేకర్స్, తదుపరి ‘సర్వ’ పాత్రలో నటిస్తున్న రాజా ప్రజ్వల్ ను పరిచయం చేయనున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న థియేటర్లలో అడుగు పెట్టనుంది.

 

 

Aadarsha Kutumbam, Venkatesh, Trivikram, Yuvina Parthavi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com