
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటనపై తనకున్న అంకితభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు. తన రెండవ బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ, ప్రస్తుతం 7 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ, ఆమె తన వృత్తిపరమైన బాధ్యతలను ఏమాత్రం విస్మరించకుండా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాకా' చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తన ప్రసూతి సెలవులకు (మెటర్నిటీ లీవ్) వెళ్లడానికి ముందే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని దీపికా పట్టుదలతో ఉన్నారు.
సినిమా వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, 'రాకా' సినిమా షెడ్యూల్‌ను వేగంగా ముగించడం కోసం దీపికా పదుకొణె ఏకంగా నైట్ షిఫ్ట్‌లలో కూడా పనిచేస్తున్నారు. అంతేకాకుండా, ఏడు నెలల గర్భవతిగా ఉండి కూడా శారీరకంగా ఎంతో శ్రమతో కూడిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆమె నటిస్తుండటం సెట్స్‌లోని చిత్ర యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంట్లో అప్పటికే ఉన్న చిన్న పాపను చూసుకుంటూ, మరోవైపు తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో కూడా ఆమె ఏకకాలంలో రెండు భారీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తున్నారు. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న 'రాకా' చిత్రంతో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' సినిమాలోనూ దీపికా కీలక పాత్ర పోషిస్తున్నారు.
గర్భవతిగా ఉన్న సమయంలో దీపికా పదుకొణె ఇలాంటి కఠినమైన యాక్షన్ సీన్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తన మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా గ్లోబల్ హిట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాప్ డ్రామా 'సింగం అగైన్' చిత్రంలో అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లలో ఆమె పాల్గొని మెప్పించారు. దీపికా మాత్రమే కాకుండా, చిత్రసీమలో నేటి తరం కథానాయకులు వివాహం, మాతృత్వం తర్వాత హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుందనే పాత ఆలోచనలను బద్దలు కొడుతున్నారు. గతంలో నటి కియారా అద్వానీ తన కుమార్తె సరాయా గర్భంలో ఉన్నప్పుడు 'టాక్సిక్' సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. అలాగే స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం తన మొదటి కుమార్తె రాహా గర్భంలో ఉన్న సమయంలోనే హాలీవుడ్ డెబ్యూ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' కోసం అత్యంత రిస్కీ యాక్షన్ సన్నివేశాలలో నటించి సరికొత్త సరిహద్దులను చెరిపేశారు.
Deepika Padukone, Raaka Movie, Allu Arjun, Atlee





