.webp)
వెబ్ సిరీస్ : D/O ప్రసాదరావు కనబడుటలేదు
నటీనటులు : రాజీవ్ కనకాల, హిమబిందు, గాయత్రీ భార్గవి, ఉదయభాను, వసంతిక తదితరులు
ఎడిటింగ్: చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: కె మహేశ్ కుమార్
మ్యూజిక్: శ్రీరామ్
నిర్మాతలు : కె.వీ శ్రీరామ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ
ఓటీటీ : జీ5
కథ :
ప్రసాదరావు (రాజీవ్ కనకాల) కూతురు స్వాతి(వసంతిక). ప్రసాదరావుకి తన కూతురు అంటే ఎనలేని ప్రేమ. చిన్నప్పటి నుంచి కంటి రెప్పలా చూసుకుంటాడు. ప్రసాదరావుకి ఒక చిన్న కిరాణ షాప్ ఉంది. దానిని నడుపుతూనే కూతురిని చదివిస్తుంటాడు. కూతురు స్వాతి కాలేజీ విద్య పూర్తయిన తర్వాత హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అయితే తనని సిటీకి పంపించడం ప్రసాదరావుకి ఇష్టం ఉండదు. దాంతో అతను ఒప్పుకోడు. ఇక అందరు కలిసి ఒప్పించడంతో ప్రసాదరావు ఒప్పుకుంటాడు. అలా జాబ్ చేయడానికి హైదరాబాద్ కి స్వాతి వస్తుంది. ఇక హైదరాబాద్ లో భవానీ (గాయత్రి భార్గవి) నడిపే ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో చేరుతుంది స్వాతి. అయితే అతి కష్టంగా స్వాతిని ఒంటరిగా ప్రసాదరావు వదిలి వెళ్తాడు. ఆ తర్వాత కొన్నిరోజులు బాగానే సాగుతుంది. నెల రోజుల తర్వాత స్వాతి కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత స్వాతి శవంగా దొరుకుతుంది. కూతురిని ఆ పరిస్థితుల్లో చూసిన తండ్రి ప్రసాదరావు స్పృహ తప్పి హాస్పిటల్లో చేరతాడు. సంచలనం రేపిన ఆ కేసును పోలీస్ ఆఫీసర్ రెబాకా జోసెఫ్ (ఉదయభాను) దర్యాప్తు చేపడుతుంది. స్వాతి మరణం వెనుక ఉన్న అసలు నిజమేంటి? ప్రసాదరావు ఏం చేశాడు ? పోలీస్ ఆఫీసర్ రెబాకా జోసెఫ్ దర్యాప్తులో ఎలా సాగింది? అసలు స్వాతి హాస్టల్ లో ఏం జరిగిందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ వెబ్ సిరీస్ కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ నాన్న కథ. తన కూతరు చావుకి కారణం ఏంటని సాగేదే ఈ సిరీస్. మొదటి నుండి చివరి వరకు ప్రతీ పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎందుకంటే దర్శకుడు ఆ క్యారెక్టర్ లని అలా మలిచాడు. అయితే ఇలాంటి కథతో ఇంతకముందు చాలానే వచ్చాయి. కానీ ఇందులోని కొన్ని ట్విస్ట్ లు ఎవరు ఊహించరు. చివరి ఎపిసోడ్ లో రివీల్ చేసిన ఆ ట్విస్ట్ అందరికి ఓ మెసెజ్ ని ఇస్తుంది. కూతురిని కన్న తల్లిదండ్రులకి ఈ సినిమా ఓ పాఠంగా ఉంటుందనడంలో సందేహమే లేదు.
ఈ వెబ్ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్ లు ఉంటాయి. మొదటి ఎపిసోడ్ లో కూతురికి ఆఫర్ లెటర్ రావడం, హైదరాబాద్ కి తీసుకురావడం, జాబ్ కి వెళ్ళడం. కొన్ని రోజుల తర్వాత కూతురు కనపడుటలేదు.. పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సెకెండ్ ఎపిసోడ్. ఇందులో స్వాతి హైదరాబాదు హాస్టల్ లో జాయిన్ అయ్యాక ఏం జరిగిందనేది చూపిస్తూనే.. ఓ చిన్నపిల్లాడి స్టోరీని ప్యార్ లాల్ గా చూపిస్తాడు దర్శకుడు. ఇక మూడో ఎపిసోడ్ లో ఎండ్ పాయింట్ ని రివీల్ చేసి .. ఇక ఏం జరుగుతుందో చూడాలనేలాగా మలిచారు. నాలుగో ఎపిసోడ్ లో ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటుంది. ఇది కాస్త స్లోగా అనిపించినా స్వాతి ఎలా చనిపోయిందో తెలుసుకోవడం కోసం కాస్త డీటేయిలింగ్ గా ఇన్వెస్టిగేషన్ సాగిందని చెప్పాలి. ఇక అయిదో ఎపిసోడ్ లో డ్రాప్ చేసింది ఎవరని సెక్యూరిటీ చెప్పకపోవడం పెద్ద సినిమాటిక్ లిబర్టీగా అనిపించింది.
ఆరో ఎపిసోడ్ లో మొదటి ఎపిసోడ్ నుండి సాగిన ఇన్వెస్టిగేషన్ లోని పాయింట్లని పెడుతూ అన్నింటిని కనెక్ట్ చేస్తూ ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది. థ్రిల్ ని పంచుతూ సాగే ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ ని ఎవరూ ఊహించరు. అయితే చివర్లో ప్రతీ తల్లిదండ్రులు తమ కూతురిని భయంతో కాకుండా ధైర్యంతో పెంచాలనే ఓ మెసెజ్ ఉంటుంది. అది చాలా బాగా చూపించారు. సిరీస్ లో తండ్రి, కూతుళ్ళ బాండింగ్ బాగా చూపించారు. మ్యూజిక్ బాగుంది. అశ్లీల సీన్లు లేవు. అసభ్య పదాజాలం వాడలేదు. ఫ్యామిలితో కలిసి చూసేలా మేకర్స్ ఈ సిరీస్ ని మలిచారు. ఎడిటింగ్ నీట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ప్రసాదరావుగా రాజీవ్ కనకాల, స్వాతిగా అవంతిక ఆకట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ గా ఉదయభాను తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : మస్ట్ వాచెబుల్ ఎంగేజింగ్ వెబ్ సిరీస్.
రేటింగ్ : 2.75/ 5
✍️. దాసరి మల్లేశ్






.webp)
