
తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శైలి ఎప్పుడూ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. పబ్లిక్ మీటింగ్‌లలో అయినా, మీడియా ఇంటర్వ్యూలలో అయినా ఆయన చేసే వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక ఈవెంట్ లో టాలీవుడ్ స్టార్ హీరోలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్స్‌గా చలామణి అవుతున్న పలువురు నటుల బాల్యం, వారి కాలేజీ రోజుల గురించి ముఖ్యమంత్రి ఓపెన్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ, స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న టాలీవుడ్ హీరోలందరూ తనకు వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే తెలుసని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అని చెప్పుకునే వాళ్లందరూ నాకు వారు కిడ్స్ ఉన్నప్పటి నుంచే బాగా తెలుసు. నేను ఇప్పుడు ఎవరి పేర్లు ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు కానీ, ఒకప్పుడు వాళ్ళు కాలేజీలకు వెళ్లే రోజుల్లో నా కళ్ల ముందే తిరిగారు. కాలేజీ చదువులు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన కొత్తలో వారి అల్లరి పనులు, సరదాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి" అంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ స్టార్స్ వ్యక్తిగత విషయాలపై మరింత ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. "ఆ హీరోలు కాలేజీల నుండి బయటకు వచ్చిన తరుణంలో.. కనీసం ఒక సింగిల్ బీరు తాగాలనుకున్నా కూడా నా దగ్గరికే వచ్చేటోళ్లు. అన్న.. నువ్వు ఒక్క సంతకం పెడితే చాలు, మేము వెళ్లి బీరు తాగుతాము అంటూ నా చుట్టూ తిరిగేవాళ్లు" అని నవ్వుతూ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ సరదా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అసలు రేవంత్ రెడ్డి ఏ హీరోను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే దానిపై నెటిజన్లు, సినీ అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.






