
అవును. 'చిరంజీవి కొడుకు రామ్‌చరణ్' అనే స్థాయి నుంచి 'రామ్‌చరణ్ తండ్రి చిరంజీవి' అనిపించుకొనే స్థాయికి చరణ్ వెళ్తాడని మెగాస్టార్ చిరంజీవి ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తండ్రి బాటలో నటుడిగా మారిన చరణ్.. ఇవాళ టాలీవుడ్‌లోని టాప్ స్టార్స్‌లో ఒకడిగా రాణిస్తున్నాడు. తండ్రి కమ్‌బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150'తో ప్రొడ్యూసర్‌గా కూడా మారాడు. మునుపటి చిరు సినిమా 'సైరా నరసింహారెడ్డి' నిర్మాత కూడా అతనే. ఈ నేపథ్యంలో చరణ్ గురించి ఏం చెబుతారనే ప్రశ్న ఎదురైనప్పుడు, "చరణ్ ఈజ్ వండర్‌ఫుల్ కిడ్" అని చిరంజీవి చెప్పారు.
"మనం ఎంత సాధించాం, ఎంత సంపాదించాం అనేది పక్కనపెడితే మన బిడ్డలు రాణించినప్పుడే ఆ జీవితానికి ఒక తృప్తి ఉంటుంది, దానికి సార్థకత ఏర్పడుతుంది. ఆ విధంగా చరణ్ మూలంగా నా జీవితానికి సంపూర్ణత చేకూరిందని నేను చెప్పగలను. చరణ్ లాంటి కొడుకు ఉండటం నాకు గర్వకారణం. అటు నటనాపరంగా కానీ, వ్యక్తిత్వంతో కానీ, ఒకరికి సహాయపడే గుణంలో కానీ.. చరణ్ ఎప్పుడూ ముందుంటాడు. ఒక్కోసారి తనేం చేస్తాడో మనకు తెలీదు. కొన్ని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతాడు. అందరూ అంటుంటారు.. చిరంజీవి కొడుకు రామ్‌చరణ్ అని. కానీ రామ్‌చరణ్ తండ్రి చిరంజీవి అనిపించుకొనే స్థాయికి అతను వెళ్తాడు, ఆ ఆనందం నాకిస్తాడని నేను ఎదురు చూస్తున్నాను" అని ఆశాభావం వ్యక్తం చేశారు మెగాస్టార్.






