'ఆర్ఆర్ఆర్'కు ఆలియా డేట్స్ దొరికేనా?
on Apr 26, 2020
సినిమా ఇండస్ట్రీలో పనులు మామూలుగా జరిగే పరిస్థితులు వస్తే, ఆయా సినిమాలకు డేట్స్ ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాని పరిస్థితి చాలా మంది హీరోయిన్లది. స్టార్ హీరోలకు ఆ సమస్య లేదు. ఎందుకంటే వాళ్లు ఏక కాలంలో ఒకే సినిమా చేస్తుంటారు. కానీ హీరోయిన్లకు అలా కాదు, ఒకేసారి పలు సినిమాల్లో రెండు మూడు.. అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తుంటారు. వాళ్లకు అదివరకు ఇచ్చిన డేట్స్ వృథా అయిపోయి ఉంటాయి. మళ్లీ కొత్తగా డేట్స్ అడ్జస్ట్ చేయడం తలకు మించిన భారంగా మారుతుంది. ఆలియా భట్ అందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలున్న టాప్ బాలీవుడ్ హీరోయిన్ ఆమే.
పరిస్థితులు మామూలుగా ఉన్నట్లయితే మార్చిలో సంజయ్‌లీలా భన్సాలీ మూవీ 'గంగూబాయ్ కథియవాడి' సినిమా షూటింగ్లో పాల్గొనాలి. ఆ తర్వాత, ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు వచ్చి రాజమౌళి మూవీ 'ఆర్ఆర్ఆర్' షెడ్యూల్ చేయాల్సి ఉంది. ఆపైన ఈ ఏడాది ద్వితీయార్ధంలో తన తండ్రి మహేశ్ భట్ సినిమా 'సడక్ 3'కి పనిచేయాలి.
ఇప్పుడు పరిస్థితులు తారుమారవడంతో షెడ్యూల్స్ తారుమారయ్యాయి. డేట్స్ వ్యవహారం క్లిష్టంగా మారనుంది. మరి ఆలియా ఏం చేస్తుంది? మొదట 'గంగూబాయ్' సినిమా పూర్తిచేసి, తర్వాత 'ఆర్ఆర్ఆర్'కు పనిచేస్తుందా? 'ఆర్ఆర్ఆర్' జనవరి 8న రావాలంటే ఆలియా కచ్చితంగా దానికి ప్రాధాన్యం ఇచ్చి డేట్స్ సర్దుబాటు చేయాలి. 'సడక్ 3' పరిస్థితేంటి? ఇంటి సినిమా కాబట్టి మొదట బయటి సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత 'సడక్ 3' సంగతి చూసుకుంటుందా? మరి తన బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్‌తో నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'బ్రహ్మాస్త్ర' పరిస్థితి? డిసెంబర్లో ఆ సినిమా రిలీజ్ అవుతుందా? అనుకున్న టైమ్‌కు అది రిలీజ్ కావాలంటే చివరి షెడ్యూల్ సాఫీగా జరగాలి. ప్రస్తుత వాతావరణం అందుకు అనుగుణంగా లేదు. దాంతో 'బ్రహ్మాస్త్ర' విడుదల 2021 ప్రథమార్ధానికి మారే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
Also Read