Home

»

Latest News

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పర్మనెంట్ బ్యాన్.?

Jul 18, 2026 10:44AM

టాలీవుడ్‌లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉన్న వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆయనపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో, జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ సహాయ నిరాకరణ (నాన్-కోఆపరేషన్) ప్రకటించింది. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ప్రధాన ఆరోపణతో ఈ కఠినమైన చర్యలకు పూనుకుంది. ఈ నిర్ణయం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 

ఇకపై జానీ మాస్టర్ దేశంలో ఏ భాషా చిత్రానికి, ఏ పరిశ్రమలో వర్క్ చేసినా కూడా సినీ పరిశ్రమకు చెందిన మిగతా 23 క్రాఫ్ట్‌ల సభ్యులు ఎవరూ ఆయనకు సహకరించబోరని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటన విడుదల చేయడమే కాకుండా, సినిమా నిర్మాతలకు కూడా ఈ విషయాన్ని గట్టిగా తెలియజేయాలని నిర్ణయించింది.

ఈ వివాదం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని ఫెడరేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. జానీ మాస్టర్ తన భార్యకు ఉన్న అసోసియేషన్ పదవిని అడ్డుపెట్టుకుని, యూనియన్‌లో పూర్తి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఈ నెల 12న జానీ మాస్టర్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ఫెడరేషన్ సభ్యులను రెచ్చగొట్టేలా మాట్లాడిన తీరు పరిశ్రమలో తీవ్ర దుమారం రేపింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఆయన ప్రవర్తించారని ఫెడరేషన్ ప్రతినిధులు మండిపడుతున్నారు. 

ఈ వివాదంపై చర్చించేందుకు, ఆయన వివరణ కోరేందుకు ఈ నెల 14న ఫెడరేషన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా జానీ మాస్టర్‌ను ఆదేశించారు. అయితే ఆ విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో ఫెడరేషన్ ఈ చర్యను మరింత తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత ఈ నెల 17 మధ్యాహ్నం ఫెడరేషన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమై ఈ సహాయ నిరాకరణ నిర్ణయాన్ని అధికారికంగా ఖరారు చేశారు.

ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందిన తేదీ నుండి సరిగ్గా 7 రోజుల వ్యవధిలో ఆయన లిఖితపూర్వకంగా ఫెడరేషన్‌కు వివరణ ఇవ్వాలని, లేదా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 7 రోజుల గడువులోగా జానీ మాస్టర్ నుండి సరైన వివరణ రాకపోయినా, లేదా ఆయన పద్ధతి మార్చుకోకపోయినా సినీ పరిశ్రమ నుండి ఆయనను శాశ్వతంగా బహిష్కరించే (పర్మనెంట్ బ్యాన్) అవకాశం ఉందని ఫెడరేషన్ హెచ్చరించింది. 

ఫెడరేషన్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవేళ ఈ సహాయ నిరాకరణ సుదీర్ఘ కాలం అమల్లో ఉంటే, జానీ మాస్టర్‌తో భారీ బడ్జెట్ సినిమాలు చేయాలనుకునే స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలకు ఇది పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. 23 క్రాఫ్ట్‌ల కార్మికులు సహకరించకపోతే షూటింగ్‌లు జరపడం అసాధ్యం కాబట్టి, ఇది ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

మరి ఈ నోటీసులపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో, ఎలాంటి వివరణ ఇస్తారో అని చిత్ర పరిశ్రమ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

 

 

Telugu Film Federation, Jani Master, Controversy, Boycott, Tollywood

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com