'బండ్ల' చురకలు.. డైరెక్ట్ గా 'పూరి'కి, ఇన్ డైరెక్ట్ గా 'ఛార్మి'కి!
on Jun 23, 2022
నటుడిగా, నిర్మాతగా కంటే తన స్పీచ్ లతోనే ఎక్కువ మందికి చేరువయ్యాడు బండ్ల గణేష్. ఏదైనా సినిమా ఈవెంట్ కి బండ్ల వస్తున్నాడని తెలిస్తే చాలు.. ఆయన స్పీచ్ కోసం ఎంతగానో ఎదురుచుస్తారంతా. ప్రశంస అయినా, విమర్శ అయినా మనసులో ఏదీ దాచుకోకుండా వేదిక మీద బయటపెట్టడం బండ్ల స్టైల్. తాజాగా మరోసారి బండ్ల మైక్ పట్టి విజృంభించాడు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన 'చోర్ బజార్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో బండ్ల స్పీచ్ సంచలనంగా మారింది.
పూరి, హీరోయిన్ ఛార్మి మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి 'పూరి కనెక్ట్స్' పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే వీరి మధ్య ఫ్రెండ్ షిప్, ప్రొఫెషనల్ బాండింగ్ ని మించిన బంధం ఏదో ఉందన్న టాక్ ఉంది. అంతేకాదు పూరి తన భార్య లావణ్యకు విడాకులు ఇచ్చి ఛార్మికి పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఈ విడాకుల అంశంపై స్పందించిన ఆకాష్.. తన తల్లి ప్రేమ చాలా గొప్పదని, వాళ్ళు విడిపోయే అవకాశమే లేదని అన్నాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ మాత్రం.. పూరి తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
'చోర్ బజార్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి తాను తన వదిన లావణ్య గారికోసమే వచ్చానని తెలిపాడు. తన తల్లిని ఎంత గౌరవిస్తానో, ఆమెని అంత గౌరవిస్తానని చెప్పాడు. పూరి అన్న సక్సెస్ జర్నీలో మెజారిటీ షేర్ లావణ్య గారికే దక్కుతుందని అన్నాడు. "ఎన్నో ర్యాంప్ లు, వ్యాంప్ లు వస్తుంటాయి, పోతుంటాయి. అమ్మ కలకాలం ఉంటుంది. పూరి దగ్గర ఏమీలేని రోజుల్లోనే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పూరి స్టార్ అయ్యాక చాలామంది వచ్చారు." అంటూ బండ్ల కామెంట్స్ చేశాడు.
ప్రీరిలీజ్ ఈవెంట్ కి పూరి రాకపోవడంపై బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేశాడు. "ఎందరినో సూపర్ స్టార్లని చేసిన ఆయనకు కన్న కొడుకు ఈవెంట్ కి వచ్చే టైం లేదు. అదే నా కొడుకు ఈవెంట్ అయితే నేను లండన్ లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తాను. నేను బ్రతికేదే నా కుటుంబం కోసం. పూరి అన్న ఎక్కడున్నాడో, ఏం బిజీగా ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు అన్నా. ఎందుకంటే మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా పిల్లల కోసమే. మనం పోతే తలకొరివి పెట్టేది వాళ్లే. మన కన్నాం కాబట్టి మనదే బాధ్యత. బాధ్యత తీసుకున్నాం కాబట్టి చచ్చేదాకా వదలకూడదు. ఎందరినో స్టార్ హీరోలను చేశావ్, నన్ను స్టార్ ప్రొడ్యూసర్ ని చేశావ్.. నీ కొడుకు టైం వచ్చేసరికి ముంబైలో కూర్చుంటే ఎలా అన్న?" అంటూ పూరికి చురకలు వేశాడు బండ్ల.
"ఆకాష్ అద్భుతమైన నటుడు. టాలెంట్ ఉంది. నువ్వు చేసినా, చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు. ఆకాష్ డేట్స్ కోసం నువ్వు కూడా క్యూలో నిల్చొనే రోజు వస్తుంది. ఆరోజు నీకు ఆకాష్ డేట్స్ ఇవ్వకుండా నేను చేస్తాను" అంటూ బండ్ల సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే, "పూరి వల్ల స్టార్లు అయిన హీరోలు వచ్చి.. ఆకాష్ కి సపోర్ట్ చేస్తారు అనుకున్నా. కానీ వీడు స్టార్ అయితే ఎక్కడ మాకు పోటీ వస్తాడో అని ఎవరూ సపోర్ట్ చెయ్యట్లేదు. ఆకాష్ అనే వాడిని స్టార్ అవ్వకుండా ఎవరు ఆపలేరు" అంటూ బండ్ల తన స్పీచ్ తో అదరగొట్టాడు.
Also Read