తెలుగులో నటుడిగా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టులో షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు రూ.95 లక్షల జరిమానా విధించడంతో పాటు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు.
గతంలో మద్దిరాలపాడుకు చెందిన జెట్టి వెంకటేశ్వరరావుకు బండ్ల గణేష్ రూ.95 లక్షలు బాకీ ఉన్నారు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే క్రమంలో తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ నుంచి రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. కానీ ఆ చెక్ బ్యాంకులో చెల్లుబాటు కాకపోవడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు తాజాగా బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
ఇదిలా ఉంటే.. బండ్ల గణేష్‌కు గతంలోనూ బ్యాంకులతో ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర్ పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూనియన్ బ్యాంక్ ఇచ్చిన రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా తాకట్టు పెట్టారు. అయితే కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంక్ వేలం వేసింది.
ఇది కూడా చదవండి: బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్ 150 కోట్లకుపైనే.. ఓటీటీలోకి 5 భాషల్లో కన్నడ బ్లాక్‌బస్టర్.!
ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ బండ్ల గణేష్ రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ట్రైబ్యునల్ వేలం ప్రక్రియను రద్దు చేసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి యజమానులకు అప్పగించాలని, ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తికి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
అయితే డీఆర్‌టీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డీఆర్‌టీ ఉత్తర్వులను కొట్టివేస్తూ బ్యాంక్ తీసుకున్న చర్యలను సమర్థించింది. దీంతో బండ్ల గణేష్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇలా ఒకవైపు రూ.95 లక్షల చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష, జరిమానా విధించడంతో పాటు మరోవైపు బ్యాంకు రుణాలకు సంబంధించిన ఆస్తుల వేలం వివాదం కూడా బండ్ల గణేష్‌ను వెంటాడుతోంది. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఆయనకు ఇప్పుడు వరుస న్యాయపరమైన సమస్యలు ఎదురవుతుండటం చర్చనీయాంశంగా మారింది.
మీకు నచ్చవచ్చు:
‘ట్విలైట్’ హీరో ఇప్పుడు ఏజెంట్ 007.. జేమ్స్‌బాండ్‌గా సంచలన ఎంట్రీ.!
IMDBలో ‘ది ఒడిస్సీ’ని క్రాస్ చేసిన ‘రామాయణ’.. 13 రోజుల కలెక్షన్ ఎంతంటే.?
[BandlaGanesh, ChequeBounceCase, BandlaGaneshJailSentence, OngoleCourtVerdict]





