Home

»

Latest News

ఆమెను ప్రేమించినవాళ్లంతా చనిపోతున్నారు.. ఎవ‌రు చంపుతున్నారు, ఏమిటీ మిస్ట‌రీ.!

Sep 25, 2026 4:40PM

తమిళంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ ‘అధరన్’ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రజిన్ పద్మనాభన్, ఇవానా వరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతోష్ రావణన్ దర్శకత్వం వహించారు. సాంబశివం నిర్మించారు. ప్రేమ, హత్యలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథను నడిపిస్తూ.. అసలు హంతకుడు ఎవరు అనే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్‌గా ఉంచే ప్రయత్నం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది?

కథలోకి వెళితే.. కార్తీక (ఇవానా వరుణ్) ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువతి. ఆమె తండ్రి శంకర్ ప్రముఖ బిల్డర్. రాజకీయ పలుకుబడి కూడా ఉన్న కుటుంబం కావడంతో కార్తీకను ఎంతో గారాబంగా పెంచుతాడు. తన కూతురికి మంచి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేయాలని శంకర్ భావిస్తుంటాడు. కానీ కార్తీక మాత్రం ఆటో డ్రైవర్ ఆదిత్యను ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన తండ్రి ఆమెను వారిస్తాడు.

తన తండ్రి తమ ప్రేమను అంగీకరించడని తెలిసినా కార్తీక ఆదిత్యతో తన సంబంధాన్ని కొనసాగిస్తుంది. అయితే అనూహ్యంగా ఆదిత్య హత్యకు గురవుతాడు. ఈ ఘటనతో కార్తీక తీవ్రంగా కలత చెందుతుంది. తన తండ్రిపైనే అనుమానం వ్యక్తం చేస్తుంది. శంకర్ మాత్రం తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. ఇంతలో కార్తీక జీవితంలోకి వచ్చిన సురేశ్, గౌతమ్ కూడా దారుణంగా హత్యకు గురవుతారు.

వరుసగా కార్తీకను ప్రేమించిన వ్యక్తులు హత్యకు గురవుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఈ హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ చెలియన్ (ప్రజిన్ పద్మనాభన్) రంగంలోకి దిగుతాడు. హత్య జరిగిన ప్రతి ప్రదేశంలోనూ అద్దంపై పెదవుల ముద్ర కనిపించడంతో అది కీలకమైన క్లూగా మారుతుంది.

చెలియన్ ఒకవైపు కార్తీక తండ్రి శంకర్ కదలికలను పరిశీలిస్తూనే.. మరోవైపు గతంలో కార్తీకను ప్రేమించిన వ్యక్తుల గురించి ఆరా తీస్తాడు. ఒక్కొక్కరిని విచారిస్తూ కేసులోని మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. అసలు కార్తీకను ప్రేమించినవారంతా ఎందుకు చనిపోతున్నారు? ఈ హత్యలకు శంకర్‌కు ఏమైనా సంబంధం ఉందా? చివరకు పోలీసులకు అసలు నిజం ఎలా తెలుస్తుంది? అనేదే మిగతా కథ.

సస్పెన్స్ థ్రిల్లర్‌కు హత్యలు, క్లూస్, ఇన్వెస్టిగేషన్ కీలకమైన అంశాలు. ‘అధరన్’లో కూడా దర్శకుడు ఈ మూడు అంశాల చుట్టూనే కథను నడిపించే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులు కూడా పోలీస్ ఆఫీసర్‌తో కలిసి హంతకుడు ఎవరు అనే విషయాన్ని అంచనా వేస్తూ ముందుకు సాగుతారు. అయితే కథలో కొన్ని చోట్ల అనుమానాలను రేకెత్తించేలా చేసినప్పటికీ.. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా ఉంటే సినిమా ప్రభావం పెరిగేది.

ముఖ్యంగా హత్యా ప్రదేశాల్లో కనిపించే పెదవుల ముద్రే సినిమా టైటిల్‌కు సంబంధించిన ప్రధాన క్లూగా ఉంటుంది. కానీ ఈ అంశాన్ని మరింత బలంగా కథలో ఉపయోగించి ఉంటే ఆసక్తి పెరిగేది. చివరి దశలో దర్శకుడు ఊహించని మరో కోణాన్ని పరిచయం చేస్తారు. అదే సినిమాలో కీలకమైన ట్విస్ట్‌గా మారుతుంది. అయితే అప్పటివరకు నెమ్మదిగా సాగిన కథకు ఈ ట్విస్ట్ పూర్తిగా బలం చేకూర్చలేకపోయింది.

ప్రజిన్ పద్మనాభన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన పరిధిలో నటించారు. ఇవానా వరుణ్ కూడా కార్తీక పాత్రకు సరిపోయేలా కనిపించారు. అనుపమ కుమార్, ఇతర నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. కిశోర్ రామచంద్రన్ కెమెరా పనితనం, హరి నేపథ్య సంగీతం, అశ్విన్–సతీష్ ఎడిటింగ్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే.. ప్రేమ, వరుస హత్యలు, అనుమానాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్‌తో ‘అధరన్’ ఆసక్తికరమైన పాయింట్‌తో మొదలవుతుంది. అయితే ఆ పాయింట్‌ను తెరపై మరింత బలంగా ఆవిష్కరించడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదనే అభిప్రాయం కలుగుతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ కొంత కొత్తగా అనిపించినా.. అప్పటివరకు సాగిన కథనం కారణంగా ఆ ప్రభావం పెద్దగా కనిపించదు.

 

 

[Andharan Movie Review, Andharan Review Telugu, Andharan OTT Review, Andharan Movie, Andharan Aha, Prajin Padmanabhan, Ivana Varun, Andharan Story, Andharan Thriller, Andharan Movie OTT, Santhosh Raavanan, Andharan Movie Review Telugu, Tamil Thriller Movies, Aha OTT Movies]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com