
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైవిధ్యభరితమైన మేకింగ్‌తో తెరకెక్కిన అద్భుత దృశ్యకావ్యం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). హిందూ పురాణ ఇతిహాసమైన మహాభారతాన్ని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసి సరికొత్త హంగులతో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది.
అయితే, ఈ సినిమా సాధించిన కమర్షియల్ సక్సెస్ ఒక ఎత్తు అయితే, ఇందులో చూపించిన కొన్ని మైథలాజికల్ పాత్రల చిత్రణపై మాత్రం పరిశ్రమలోనే కాకుండా హిందూ సమాజంలోనూ తీవ్రమైన చర్చలు, వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ గీత రచయిత (Anantha Sriram) అనంత శ్రీరామ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కల్కి సినిమాలో పురాణ ఇతిహాసాలను ఘోరంగా వక్రీకరించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
కల్కి సినిమాలో కర్ణుడి పాత్రను చూపించిన విధానంపై అనంత శ్రీరామ్ తన తీవ్ర అసంతృప్తిని మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహాభారత ఇతిహాసం ప్రకారం అర్జునుడు అత్యంత గొప్ప వీరుడని, కానీ ఈ సినిమాలో నాగ్ అశ్విన్ కేవలం సినిమాటిక్ లిబర్టీ పేరిట అర్జునుడి కంటే కర్ణుడిని ఎంతో గొప్పవాడిగా, శ్రేష్ఠుడిగా చూపించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. హిందూ సమాజం ఇలాంటి వక్రీకరణలను చూస్తూ ఎలా మౌనంగా ఉంటుందని, ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో ఏమీ చేయకుండా చూస్తూ నిలబడిన కర్ణుడి పాత్రను ఇంతలా మానవీకరణ చేయడం, అతడిని ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయడం తనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించిందని అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వక్రీకరణలు జరుగుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా తాను ఎంతో సిగ్గుపడుతున్నానని, ఇకపై ఇలాంటి వాటిపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
దర్శకులకు తమ సొంతంగా క్రియేట్ చేసిన పాత్రల విషయంలో ఎంత స్వేచ్ఛ అయినా ఉండవచ్చని.. దర్శకులు సృష్టించే ఫిక్షనల్ పాత్రలు వారి ఇష్టప్రకారం ప్రవర్తించవచ్చని అనంత శ్రీరామ్ స్పష్టం చేశారు. కానీ, వాల్మీకి మహర్షి దివ్యదృష్టితో చూసి, జరిగింది జరిగినట్లుగా రాసిన రామాయణం లేదా వేదవ్యాసుడు అందించిన మహాభారతం వంటి పవిత్ర ఇతిహాసాలను మార్చే హక్కు ఎవరికీ లేదని ఆయన నొక్కి చెప్పారు. మన దేశంలో ఉంటూ రామాయణ, మహాభారతాలను కేవలం ఒక కల్పిత కథలుగా భావించే వాళ్ళను తాను అస్సలు భారతీయులుగానే పరిగణించనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఒక దర్శకుడు తాను రాసిన పాటలో భగవంతుడిని ఉద్దేశించి ఉపయోగించిన 'బ్రహ్మాండ నాయకుడు' అనే పదాన్ని తొలగించమని కోరినప్పుడు, ఆ దర్శకుడితో ఇకపై జీవితంలో పని చేయనని శపథం చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో లౌక్యం కోసం లేదా అవకాశాల కోసం తన భావ వ్యక్తీకరణను, హిందూ ధర్మాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టనని, పాటలు హిట్ అయితే అవకాశాలు వస్తాయి లేదంటే లేవు అనే సత్యాన్ని తాను నమ్ముతానని అనంత శ్రీరామ్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు.




.webp)

