2022 సంక్రాంతి బరిలో మూడో మల్టిస్టారర్ గా `బంగార్రాజు`!
on Oct 20, 2021
2022 సంక్రాంతి బిగ్ టికెట్ ఫిల్మ్స్ తో కళకళలాడనుంది. జనవరి 7న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` విడుదల కానుండగా.. జనవరి 12న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి స్టార్ రానా కాంబినేషన్ మూవీ `భీమ్లా నాయక్` సందడి చేయనుంది. ఇక జనవరి 13న సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న `సర్కారు వారి పాట` రిలీజ్ కానుండగా.. జనవరి 14న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ డ్రామా `రాధే శ్యామ్` తెరపైకి రానుంది.
కాగా, ఇదే పొంగల్ సీజన్ లో `సోగ్గాడే చిన్ని నాయనా`(2016)కి సీక్వెల్ గా రూపొందుతున్న `బంగార్రాజు` కూడా రిలీజ్ కాబోతున్నట్లు బజ్. అంతేకాదు.. `సోగ్గాడే..` విడుదల తేది అయిన జనవరి 15నే `బంగార్రాజు` కూడా టార్గెట్ చేసుకుందని సమాచారం. అదేగనుక నిజమైతే.. `ఆర్ ఆర్ ఆర్`, `భీమ్లా నాయక్` తరువాత 2022 సంక్రాంతి సీజన్ లో రిలీజయ్యే మూడో మల్టిస్టారర్ గా `బంగార్రాజు` నిలుస్తుంది. కింగ్ నాగార్జున, ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగచైతన్య కాంబోలో `బంగార్రాజు` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.