Home

»

Latest News

Alpha: రీసెంట్ బెస్ట్ ట్రైలర్ కట్ ఇదే.. లంకని కాల్చడానికి సీతనే వచ్చింది కదా!

Jun 18, 2026 10:32AM

 

ప్రేక్షకులకి మనం ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్లాలని అనిపించాలంటే ప్రమోషన్స్ చాలా ముఖ్యం. మరి ముఖ్యంగా ఆ ఇంపాక్ట్ స్థాయిని పెంచేది ట్రైలర్.  ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్ నుండి వస్తున్న మొట్టమొదటి మహిళా ప్రధాన స్పై యాక్షన్ థ్రిల్లర్ "ఆల్ఫా" ఇస్తుంది. అధికారిక ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాని  షేక్ చేస్తోంది. బుధవారం విడుదలైన ఈ ట్రైలర్ కట్ చూసిన సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు, ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ ట్రైలర్ కట్ ఇదేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు శివ్ రావైల్ తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్  భీభత్సమైన యాక్షన్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ట్రైలర్ ప్రారంభంలో ఒక గాజు గదిలో ఉన్న చిన్న పాపను చూపిస్తూ, ఆమె తల్లి పేరు జానకి కాబట్టి ఆ పాపకు 'సీత' అని పేరు పెట్టినట్లు విలన్ ఫతే (బాబీ డియోల్) చెప్పే డైలాగ్‌తో కథనం ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ చిన్నారిని ఒక క్రూరమైన కిల్లింగ్ మెషిన్‌గా, ఆర్డర్ ఇస్తే క్షణాల్లో టార్గెట్‌ను ఖతం చేసే అత్యంత పవర్‌ఫుల్ హంతకురాలిగా ఫతే చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇస్తాడు. అయితే, ఇక్కడే మేకర్స్ ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అలియా భట్ వాయిస్ ఓవర్ ద్వారా ఫతే తన నిజమైన తండ్రి కాదని, అతనొక మోసపూరితమైన రాక్షసుడని తెలుస్తుంది. "ఒకప్పుడు ఒక రాక్షసుడు ఒక యువరాణిని కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లాడు, చరిత్రలో ఆ కథ ఎలా ముగిసిందో అందరికీ తెలుసు.. కానీ ఈసారి లంకను తగలబెట్టడానికి హనుమంతుడు కాదు, నేరుగా ఆ సీతనే వచ్చింది" అంటూ అలియా చెప్పే డైలాగ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పవర్‌ఫుల్ మిషన్‌లో అలియా భట్‌కి  తోడుగా మరో క్రేజీ హీరోయిన్ శర్వరీ వాగ్ జాయిన్ అవుతుంది. ట్రైలర్‌లో వీరిద్దరి మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ మరియు ఆ తర్వాత వారిద్దరూ కలిసి శత్రువులపై చేసే పోరాటం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంది. దేశం కోసం పనిచేసి మోసపోయిన మాజీ స్పై ఫతే, భారతదేశంపై పగ తీర్చుకోవడానికి 'ఆల్ఫా' అనే భయంకరమైన వ్యూహంతో సిద్ధమవుతుంటే, అతన్ని అడ్డుకోవడానికి సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక గైడ్‌గా మారి ఈ ఇద్దరు భామలను నడిపించడం కథలో కీలకమైన అంశం. 2 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ ట్రైలర్ చివర్లో వచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. స్పై యూనివర్స్ ఐకానిక్ సూపర్ స్పై కబీర్ (హృతిక్ రోషన్) తన పచ్చటి కళ్ళతో ఇచ్చే ఎంట్రీ, ఈ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సరికొత్త యాక్షన్ బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com