సరైనోడులో విలన్ పాత్ర ఇదేనా..?
on Mar 8, 2016
తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది తమిళంలో మంచి హిట్సే సాధించాడు. అక్కడ ఎబౌ యావరేజ్ హీరోగా ఉన్న ఆదికి తెలుగు మాత్రం పెద్దగా కలిసిరావట్లేదు. ఇక్కడ బాగా ఆడిన తన సినిమా వైశాలి కూడా డబ్బింగ్ నుంచి వచ్చిందే. దీంతో ఇప్పుడు ప్రతినాయకుడిగా తన ప్రతిభను చూపించబోతున్నాడు. అల్లు అర్జున్ సరైనోడులో ఆది విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమాలో ఆది పాత్ర ఏమిటన్న దానిపై కొన్ని వార్తలు వస్తున్నాయి.
సరైనోడులో అల్లు అర్జున్ పోలీస్ పాత్ర వేస్తున్నాడు. హోం మినిస్టర్ కొడుకుగా ఆది నటిస్తున్నాడు. తను ప్రేమిస్తున్న రకుల్ ప్రీత్ ను ఆది బారి నుంచి దక్కించుకోవడంతో పాటు, సిఎం కూతురైన క్యాథరీన్ ట్రెసాను కూడా కాపాడటమే సినిమాలో అల్లు అర్జున్ బాధ్యత అని సమాచారం. ఇప్పటికే సరైనోడు టీజర్ మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మాత్రం, వేసవి వరకూ వెయిట్ చెయ్యక తప్పదు.