బరిలోకి దిగుతున్న బాలయ్య, పవన్.. గెలుపెవరిది?
on Jun 10, 2025
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలను ఒక పద్ధతి ప్రకారం రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని సీజన్స్‌లో పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఆ సమయంలో హీరోలు, దర్శకనిర్మాతలు స్నేహ పూర్వక వాతావరణంలో తమ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తున్నారు. గతంలో సినిమా రిలీజ్‌ల విషయాన్ని హీరోలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్, మార్కెట్ పెరిగిన కారణంగా ఇలాంటి విషయాల్లో సంయమనం పాటిస్తూ అందరికీ అనుకూలంగా ఉండే డేట్స్‌లోనే తమ సినిమాలను రిలీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నటసింహ నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి బరిలోకి దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పవన్‌కళ్యాణ్ గత ఎన్నికల ముందు తను చేస్తున్న సినిమాలను తాత్కాలికంగా పక్కన పెట్టి రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఆయన సినిమాల రిలీజ్‌కి కొంత బ్రేక్ పడింది. అయినప్పటికీ హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేశారు పవన్. అలాగే ఓజి చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. కొంత ప్యాచ్‌వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒక విధంగా ఈ రెండు సినిమాలూ రిలీజ్‌కి సిద్ధమైనట్టే. హరి హర వీరమల్లు చిత్రాన్ని జూన్ 12న విడుదల చేస్తామని మొదట ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేశారు. తర్వాతి రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకు ప్రకటించనప్పటికీ జూలైలో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న అఖండ2 చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు అంతకుముందే ఎనౌన్స్ చేశారు. దీంతో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే డేట్‌కి రిలీజ్ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మెగా హీరోల సినిమాలు, నందమూరి బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ పోటీ పడ్డాయి. చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య సినిమా వీరసింహారెడ్డి 2023 సంక్రాంతి సీజన్‌లోనే రిలీజ్ అయాయి. అయితే ఇప్పుడు అఖండ2, ఓజీ చిత్రాలు రెండూ ఒకే రోజు రిలీజ్ అవ్వడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అఖండ2 చిత్రాన్ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించినప్పటికీ ఆ డేట్‌కి సినిమా రాదని అందరూ అనుకున్నారు. కానీ, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌లో రిలీజ్ డేట్‌ను కూడా మెన్షన్ చేయడంతో కన్‌ఫర్మ్ అయిపోయింది. అయితే ఈ పోటీని ఇద్దరు హీరోల అభిమానులు స్వాగతించడం లేదు. ఎందుకంటే బాలయ్య, పవన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి పోటీ పడడం అంత ఆరోగ్యకరం కాదనేది అభిమానుల అభిప్రాయం. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై చర్చలు మొదలయ్యాయి. మరి ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో బాలయ్య, పవన్‌కళ్యాణ్, వారి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
