భీమ్లా నాయక్, డానియెల్ శేఖర్‌కు సుద్దులు చెప్తూ 'అడవి తల్లి మాట' పాట వచ్చేసింది!
on Dec 4, 2021
"కిందున్న మడుసులకా కోపాలు తెమలవూ.. పైనున్న సామేమో కిమ్మని పలకడూ" అంటూ మన ముందుకొచ్చేసింది 'భీమ్లా నాయక్'లోని 'అడవి తల్లి మాట' పాట. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన ఈ మూవీలో ఆయనతో పంతాలు పోయే డానియెల్ శేఖర్‌గా రానా దగ్గుబాటి నటించాడు. ముందుగా చెప్పినట్లే ఈరోజు ఉదయం 10:08 గంటలకు ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన 'అడవి తల్లి మాట' పాటను షేర్ చేసింది. తమన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి పాడారు. ఈ పాటను ఇటీవల ఆకస్మికంగా కన్నుమూసిన లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిచ్చారు.
భీమ్లా నాయక్, డానియెల్ శేఖర్ మధ్య చిన్నగా మొదలైన గొడవ, పంతాల కారణంగా చాలా దూరం వెళ్తుంది. ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటూ, ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఆ నేపథ్యంలో వచ్చే పాట ఇది. 'అడవి తల్లి మాట' అంటూ ఈ పాటకు టైటిల్ పెట్టినా, పాట సాహిత్యంలో ఆ మాట వినిపించదు. అంటే ఆ అడవి తల్లే ఆ ఇద్దర్నీ ఉద్దేశించి, వారికి సుద్దులు చెబ్తూ ఈ పాట పాడిందని మనం అర్థం చేసుకోవాలి.
"కిందున్న మడుసులకా కోపాలు తెమలవూ.. పైనున్న సామేమో కిమ్మని పలకడూ
దూకేటి కత్తూల కనికరమెరగవూ.. అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవూ" అంటూ పల్లవి వస్తుంది.
ఆ తర్వాత,
"సెబ్తున్న నీ మంచి సెడ్డా.. అంతోటి పంతాలు పోవాకు బిడ్డా
సిగురాకు సిట్టడివి గడ్డా.. చిచ్చుల్లో అట్టుడికి పోరాదు బిడ్డా" అంటూ మొదటి చరణంలో పంతాలు పోవద్దని చెప్పింది అడవి తల్లి.
"పుట్టాతేనె బువ్వ పెట్నా.. సెలయేటి నీళ్లు జింక పాలు పట్నా
ఊడల్ల ఉయ్యాల గట్టి పెంచీ నిన్ను ఉస్తాదల్లే నించోబెట్టా
పచ్చని బతుకిస్తే నీకూ ఎల్లెల్లి కచ్చల్ల పడబోకూ బిడ్డా" అంటూ రెండో చరణంలో ఆవేదన నిండిన సూచన చేసింది.
ఇప్పటిదాకా తను రాసిన పాటలకు భిన్నమైన తరహాలో అందమైన పల్లె యాసలో రామజోగయ్య శాస్త్రి కలం నుంచి వచ్చిన చక్కని పాట ఇది. సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేయకుండా, పాట అంతా చక్కగా పాడుకొనేట్లు ఉంది.
పాటలో పవన్ కల్యాణ్ భార్యగా నిత్యా మీనన్, రానా భార్యగా సంయుక్త మీనన్ కనిపించారు. సముద్రకని ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఈ పాటవల్ల తెలిసొచ్చింది. త్రివిక్రమ్ రచన చేయగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన 'భీమ్లా నాయక్' 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
