వివేక్ చనిపోయింది కొవిడ్ వాక్సిన్ వల్ల కాదు!
on Oct 22, 2021
తమిళ స్టార్ కమెడియన్ వివేక్ మృతికీ, కొవిడ్ వాక్సిన్కూ సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఇమ్యునైజేషన్ విభాగం కనుగొంది. కొవిడ్-19 వాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 17న వివేక్ కన్నుమూశారు. వివేక్ మృతి 'యాదృచ్ఛికం' అని సీరియస్ యాడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (AEFI)పై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ తన నివేదికలో తెలిపింది.
వివేక్ మరణానికి కారణం ‘Acute myocardial infraction with cardiogenic shock with ventricular fibrillation in a known cause of hypertension.’ అని ఆ కమిటీ పేర్కొంది. గుండెకు రక్తాన్ని చేరవేసే హృదయ ధమనిలో ఏర్పడే అడ్డంకిని 'అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్' అంటారు.
'కార్డియోజెనిక్ షాక్' అంటే గుండె ఆకస్మికంగా రక్తాన్ని పంపడాన్ని ఆపివేయడం. 'వెంట్రిక్యులార్ ఫైబ్రిలేషన్' అంటే.. ఒక రకమైన అసాధారణ హృదయ లయ. దానివల్ల గుండెలోని దిగువ గదులు మెలితిరుగుతాయి. ఫలితంగా గుండె తగినంతగా రక్తాన్ని పంప్ చేయదు.
గుండె ఆగిపోవడంతో చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు వివేక్. అప్పుడు ఎడమ వైపు అవరోహణ ధమనిలో 100 శాతం బ్లాకేజ్ ఉండటం వల్లే ఆయన గుండె ఆగిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.