'ఆచార్య' కొత్త విడుదల తేదీ.. మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్!
on Jan 16, 2022
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది.
కరోనా కారణంగా పలు పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. వాటిలో సంక్రాంతికి విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి 4 న విడుదల కావాల్సిన ఆచార్య కూడా వాయిదా పడే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఆచార్యను వాయిదా వేస్తున్నట్లు మూవీ టీమ్ శనివారం ప్రకటించింది. దీంతో ఆచార్య కొత్త విడుదల తేదీపై చర్చలు మొదలయ్యాయి. అయితే వాయిదా ప్రకటన వచ్చిన గంటల్లోనే కొత్త విడుదల తేదీని ప్రకటించింది మూవీ టీమ్. ఆచార్య సినిమాని ఉగాది కానుకగా ఏప్రిల్ 1 న విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' కూడా ఏప్రిల్ 1 న విడుదల కానుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన సర్కారు వారి పాట ఏప్రిల్ 1 కి వాయిదా పడింది. అయితే కొద్దిరోజులుగా ఈ విడుదల తేదీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆచార్య ఏప్రిల్ 1 కి వస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సర్కారు వారి పాట కూడా ఏప్రిల్ 1 కే వస్తే బాక్సాఫీస్ పోరు మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ గా మారనుంది.