
తెలుగు ప్రేక్షకులకు అబ్బూరి రవి రచయితగా తెలుసు. వెండితెర వెనుక ఉంటూ... సినిమాలకు చక్కటి సంభాషణలను అందించే ఆయన్ను వెండితెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు అడివి సాయికిరణ్. అబ్బూరి రవిని నటుడిగా పరిచయం చేస్తున్నారాయన. 'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు', 'కేరింత' సినిమాలతో ప్రేక్షకుల్లో, పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. ఆది సాయికుమార్ ఎన్ఎస్‌జి కమాండోగా నటిస్తున్న ఈ సినిమాలో ఘాజీ బాబా అనే కరుడుగట్టిన తీవ్రవాది పాత్రలో అబ్బూరి రవి నటించారు. ఈ పాత్ర గురించి అబ్బూరి రవి మాట్లాడుతూ "పొద్దునే పూజలు చేసుకుని, బొట్టు పెట్టుకుని బయటకు వచ్చే నన్ను అడివి సాయికిరణ్ తీవ్రవాదిని చేశాడు. నన్ను సాయికిరణ్ తీవ్రవాదిగా చూస్తాడని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. ఊచకోత కోసే తీవ్రవాదిగా చూపించాడు" అన్నారు. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' షూటింగ్ చేసినన్ని రోజులూ అబ్బూరి రవి ఉదయం ఇంట్లో పూజలు చేసుకుని... సెట్‌కి వెళ్ళాక తీవ్రవాది గెటప్‌లో గన్ను పట్టుకుని ఫైరింగ్ చేసి ఉంటారు.




.jpg)

