
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ సినిమా విడుదలై నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, విద్యుత్ జమ్వాల్, శ్యామ్, జయప్రకాశ్ రెడ్డి, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఆ టైంలో ‘ఊసరవెల్లి’పై భారీ అంచనాలే ఉన్నాయి. అప్పటికే ‘కిక్’ లాంటి స్టైలిష్ ఎంటర్టైనర్ చేసిన సురేందర్ రెడ్డి.. ఎన్టీఆర్‌తో ఎలాంటి సినిమా తీస్తారనే ఆసక్తి ఉంది. పైగా ఎన్టీఆర్‌కు జోడీగా తమన్నా తొలిసారి కనిపించడం కూడా ఈ సినిమాపై హైప్ పెంచింది.
కథ పరంగా కూడా ‘ఊసరవెల్లి’ కాస్త డిఫరెంట్ ప్రయత్నమే. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడే టోనీ అనే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. కశ్మీర్‌లో నిహారికను కలిసిన టోనీ.. ఆ తర్వాత ఆమె జీవితంలోకి ఎలా వస్తాడు? ఆమె గతం ఏంటి? అసలు టోనీ లక్ష్యం ఏంటి? అనే అంశాలతో సినిమా సాగుతుంది.
‘ఊసరవెల్లి’ ఏకంగా 1800 థియేటర్లలో విడుదలై, అప్పట్లో రికార్డ్ సృష్టించింది. విడుదలైన తర్వాత ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రాలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్, స్క్రీన్‌ప్లేపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ భారీ ఓపెనింగ్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ట్రేడ్ వర్గాలు సైతం ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా చూసి ఆశ్చర్యపోయాయి.
సినిమా విడుదలైన రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.15.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ సమయంలో ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్. మొదటి రోజు వసూళ్లలో అమెరికా నుంచి కూడా దాదాపు రూ.1.98 కోట్లు రావడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నైజాంలో రూ.3.73 కోట్లు, రాయలసీమలో రూ.2.92 కోట్లు రావడం కూడా రికార్డ్ స్థాయిలోనే నమోదైంది.
ఇక మొదటి వారం పూర్తయ్యే సరికి ‘ఊసరవెల్లి’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.56.46 కోట్ల గ్రాస్, రూ.39.23 కోట్ల షేర్ సాధించినట్లు అప్పటి ట్రేడ్ లెక్కలు వెల్లడించాయి. 2011లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ తెలుగు సినిమాల్లో ఒకటిగా ‘ఊసరవెల్లి’ నిలిచింది.
టాక్ ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపించిన సినిమాల్లో ‘ఊసరవెల్లి’ ఒకటి. అందుకే 15 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా పేరు వినిపిస్తే.. ముందుగా గుర్తొచ్చేది టోనీ పాత్ర కంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఆ భారీ ఓపెనింగ్ రికార్డే.
ఇది కూడా చదవండి: సరిపోయారు ఇద్దరూ.. సైలెంట్‌గా పేరు మార్చుకొని వస్తున్న స్టార్ డైరెక్టర్.!
[15 Years Of Oosaravelli, 15 Years For Oosaravelli, Jr NTR Oosaravelli Movie, Oosaravelli Movie 15 Yeras, Jr NTR, Tamannaah Bhatia, Surender Reddy, Telugu Film News]






