`స్టాలిన్`గా చిరంజీవి అలరించి నేటికి 15 ఏళ్ళు!
on Sep 20, 2021
``ఎవరైనా మనకు సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పడం కాకుండా.. బదులుగా మరో ముగ్గురికి మనమూ సాయం చేయాలి`` అనే థీమ్ తో రూపొందిన సందేశాత్మక చిత్రం `స్టాలిన్`. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాని ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేశారు. చిరుకి జోడీగా త్రిష నటించిన ఈ సినిమాలో ఖుష్బూ, శారద, ప్రకాశ్ రాజ్, రవళి, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, శివారెడ్డి, హర్షవర్ధన్, హేమ, సుదీప, బ్రహ్మాజీ, సుమన్, సుబ్బరాజు, రవిప్రకాశ్, సురేఖా వాణి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా.. అనుష్క ఓ ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసింది.
మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలన్ని విశేషాదరణ పొందాయి. ``గో గో గోవా మగువా``, ``సూర్యుడే సెలవని``, ``ఐ వన్నా స్పైడర్ మ్యాన్``, ``పరారే పరారే``, ``తోబారే తోబా``, ``సిగ్గు తో ఛీ ఛీ``.. ఇలా ప్రతీ పాట మెగాస్టార్ అభిమానులను మురిపించింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై చిరు సోదరుడు నాగబాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం.. హిందీలో `జయహో` పేరుతో రీమేక్ అయింది. 2006 సెప్టెంబర్ 20న విడుదలై విజయకేతనం ఎగురవేసిన `స్టాలిన్`.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.