
తొలి చిత్రంతోనే తెలుగునాట ట్రెండ్ సెట్ చేసిన దర్శకులు అతి కొద్దిమందే ఉన్నారు. వారిలో.. సంచలన దర్శకుడు తేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో సినిమాటోగ్రాఫర్ గా తనదైన ముద్ర వేసిన తేజ.. మొదటిసారి మెగాఫోన్ పట్టిన `చిత్రం`తో నయా ట్రెండ్ సెట్ చేశారు. తక్కువ బడ్జెట్ లో సినిమా తీయడమే కాకుండా.. సంచలన విజయం అందుకుని మరీ మరెందరికో స్ఫూర్తిగా నిలిచారు.
ఉదయ్ కిరణ్, రీమా సేన్ ని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తేజ రూపొందించిన ఆ సినిమానే..`చిత్రం - ది పిక్చర్`. రమణ (ఉదయ్ కిరణ్), జానకి (రీమా సేన్) అనే విభిన్న నేపథ్యాలున్న టీనేజర్ల మధ్య సాగే రొమాంటిక్ కామెడీ డ్రామాగా `చిత్రం`ని తీర్చిదిద్దారు తేజ. ఇందులో తనికెళ్ళ భరణి, ఢిల్లీ రాజేశ్వరి, బెనర్జీ, రాళ్ళపల్లి, చిత్రం శ్రీను, భాషా, ఉత్తేజ్, బేబి చేతన, ఏవీయస్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
ఆర్. పి. పట్నాయక్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటల్లో ``ఊహల పల్లకిలో``, ``ఢిల్లీ నుంచి గల్లీ దాకా``, ``మావోయ్``, ``ఏకాంత వేళ``, ``కుక్క కావాలి``, ``అనగనగా``.. ఇలా ప్రతీ గీతం ఆదరణ పొందింది. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన `చిత్రం`.. కన్నడంలో `చిత్ర` పేరుతో రీమేకై అక్కడా విజయం సాధించింది. కాగా, 2000 జూన్ 16న విడుదలై ఘనవిజయం సాధించిన `చిత్రం`.. నేటితో 22 వసంతాలు పూర్తిచేసుకుంది.






