![]() |
![]() |

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న పిరియడ్ డ్రామా 'ఆర్ ఆర్ ఆర్'. వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో చరిత్ర పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ భూమికల్లో చరణ్, తారక్ దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే.. విజయదశమి కానుకగా అక్టోబర్ 13న రావాల్సిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ 2022 సంక్రాంతికి వాయిదా పడనుందంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. విజువల్ ఎఫెక్ట్స్ కి స్కోప్ ఉన్న సినిమా కావడంతో 2022 వేసవిని జక్కన్న అండ్ టీమ్ టార్గెట్ చేసుకుందట. అంతేకాదు.. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్ళు రాబట్టిన తన చిత్రం 'బాహుబలి - ది కంక్లూజన్' (2017) విడుదలైన ఏప్రిల్ 28నే 'ఆర్ ఆర్ ఆర్'ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట రాజమౌళి. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, 'ఆర్ ఆర్ ఆర్'ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |