![]() |
![]() |

సినిమాలతో కంటే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఓనర్ మిహీకా బజాజ్‌తో ప్రేమ వ్యవహారంతో కొంత కాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు తన కెరీర్‌లో పోషించిన పాత్రల గురించీ, వాటిలో కొన్నింటిని పోషించడానికి తాను పడ్డ బాధల గురించీ మాట్లాడాడు రానా. ఆశ్చర్యకరంగా అతడి కెరీర్‌లో టఫెస్ట్ క్యారెక్టర్ 'బాహుబలి' మూవీలోని భల్లాలదేవ కాదు. "నేనిప్పటివరకూ చేసిన సినిమాల్లో టఫెస్ట్ మూవీ 'అరణ్య'. నా భుజాలపై ఏనుగు తొండాన్ని పెట్టుకొని మోయాల్సి వచ్చేది. ఈజీగా అది 160 నుంచి 170 కేజీల బరువు ఉంటుంది. 'అరణ్య', 'బాహుబలి' సినిమాలు నాకు కొత్త అనుభవాల్ని ఇచ్చాయి" అని అతను తెలిపాడు.
'అరణ్య' మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది కానీ, కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడటంతో వాయిదా పడింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని వచ్చిన ప్రచారాన్ని ఒట్టి వదంతిగా నిర్మాతలు కొట్టివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొని, థియేటర్లు ఓపెన్ అయ్యాక సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని వారు చెప్పారు.
కాగా తన జీవితంలోనూ, ఇండియన్ సినిమా మీదా 'బాహుబలి' కలిగించిన ప్రభావం గురించి ప్రస్తావించడాన్ని రానా మరచిపోలేదు. "ఆ సినిమా నా జీవితాన్ని మార్చడమే కాదు, భారతీయ సినిమా రూపురేఖల్నే మార్చేసింది. భారతీయ సినిమా అంటే ఇదివరకు ఊహించుకొనే స్థాయి మారింది. అంతేకాదు, మనం తీసే సినిమాలు కూడా మారిపోయాయి. హాలీవుడ్‌లో 'స్టార్ వార్స్' మూవీ ఎంత ప్రభావం చూపిందో, ఇండియన్ సినిమాపై 'బాహుబలి' అంత ప్రభావం చూపింది" అని అతను అభిప్రాయపడ్డాడు. ''అరణ్య' తర్వాత అతను 'విరాటపర్వం' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో అతను నక్సలైట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకుడు.
![]() |
![]() |