![]() |
![]() |

ఈ జూన్ 14తో కథానాయకుడిగా 18 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ ప్రయాణంలో ఇప్పటివరకు 27 సినిమాలతో జనం ముందుకు వచ్చిన నితిన్.. ఆయా చిత్రాల కోసం దర్శకుల పరంగా అత్యధిక శాతం 'ఫ్రెష్ కాంబినేషన్'కే ఓటేయడం విశేషం. తన తొలి చిత్రం ‘జయం’ (2002) దర్శకుడు తేజ కాంబినేషన్‌లో ద్వితీయ ప్రయత్నంగా ‘ధైర్యం’ (2005) చేసిన నితిన్.. ఆపై మరే దర్శకుడితోనూ రెండో సినిమా చేయలేదు. కట్ చేస్తే.. ‘ధైర్యం’ తరువాత పదిహేనేళ్ళ అనంతరం మళ్ళీ ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తున్నాడు నితిన్.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మహాశివరాత్రికి విడుదలైన ‘భీష్మ’తో బౌన్స్ బ్యాక్ అయిన నితిన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఆ చిత్రాలే.. ‘రంగ్ దే’, ‘చెక్’, ‘పవర్‌పేట్’. ‘రంగ్ దే’ని ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా.. ‘చెక్’ని వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి రూపొందిస్తున్నాడు. ఈ ఇద్దరి దర్శకులతోనూ నితిన్‌కి ఇవే ఫస్ట్ కాంబినేషన్ మూవీస్ కావడం విశేషం. ఇక ‘పవర్‌పేట్’ విషయానికొస్తే.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని కృష్ణ చైతన్య తీర్చిదిద్దుతున్నాడు. నితిన్‌తో కృష్ణ చైతన్యకు ఇది రెండో చిత్రం కావడం గమనార్హం. ఇప్పటికే నితిన్, కృష్ణ చైతన్య కాంబినేషన్‌లో ‘ఛల్ మోహన్ రంగ' (2018) వచ్చింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. కృష్ణ చైతన్య టాలెంట్‌కి ఫిదా అయిన నితిన్ ఈ సినిమా రూపంలో మరో ఛాన్స్ ఇచ్చాడు. రెండు భాగాలుగా ఈ ‘పవర్‌పేట్’ తెరకెక్కనుండడం విశేషం.
బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ (తేజ)తో సెకండ్ ఫిలిమ్ చేసినప్పుడు నితిన్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో.. ఫస్ట్ కాంబినేషన్ మూవీతో నిరాశపరచిన కృష్ణ చైతన్య సెకండ్ కాంబినేషన్ ఫిలిమ్‌తో అందుకు భిన్నమైన ఫలితాన్ని అందిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |