![]() |
![]() |

ఇప్పటిదాకా అజయ్ ఘోష్‌ను కామెడీ విలన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా పలు రకాల పాత్రల్లో చూశాం. అయితే ఇంతదాకా ఆయనపై ఏ సినిమాలోనూ ఏ డైరెక్టరూ డ్యూయెట్ తీసే సాహసం చెయ్యలేదు. ఆ సాహసం 'దోచేవారెవరురా' అనే సినిమా కోసం సీనియర్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు చేశారు. ఎప్పుడూ గుండుతో కనిపించే అజయ్ ఘోష్‌కు ఫుల్ హెయిర్ విగ్గును పెట్టి, ఓ డ్యూయెట్‌ను తీశారు. అది కూడా ఆయనతో స్టెప్పులు వేయించారు. ఇంతకీ ఆ పాటను రాసింది కూడా స్వయంగా శివనాగేశ్వరరావే. ఆ పాటలో ఆయన తెలుగు భాషను కాకుండా చిత్రమైన భాషను వాడారు. దాన్ని 'పాన్ గ్లోబ్ సాంగ్' అంటూ సంబోధించారు. "సూళ్లే బాకు" అంటూ సాగే ఈ పాటకు రోహిత్ వర్ధన్ సంగీతం సమకూర్చారు. ప్రణవి సాధనాల అనే లేడీ ఆర్టిస్టుతో కలిసి అజయ్ ఘోష్ వేసిన స్టెప్పులు అలరించాయి. ఎస్పీ బాలు జయంతి సందర్భంగా శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను తనికెళ్ల భరణి లాంచ్ చేశారు. పాట ప్రదర్శించాక, వన్స్ మోర్ అని రెండోసారి కూడా వేయించుకొని ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్, అజయ్ గోష్, సిరాశ్రీ, చైతన్య ప్రసాద్, బిత్తిరి సత్తి, సునయన, సినిమాటోగ్రాఫర్ అర్లీ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్‌పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తోన్న 'దోచేవారెవరురా' మూవీలో ప్రణవచంద్ర, మాళవిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రణవచంద్ర ఎవరో కాదు.. సీనియర్ లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ తనయుడు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, "ఎస్పీ బాలు జయంతి సందర్బంగా దర్శకుడు శివనాగేశ్వరరావు రాసిన లిరికల్ వీడియోను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి" అన్నారు.
దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, "ఒక ఫ్రెండ్ ద్వారా శ్రీహరి గారు పరిచయ మయ్యారు. వారు మంచి సినిమా తీద్దామని చెప్పడంతో నేను పాన్ ఇండియా సినిమా తీద్దాం అన్నాను. నీవు ఏది తీసిన అందులో కామెడీ ఉండాలి అన్నారు. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా, కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగ్గ సినిమాగా తెరకేక్కించడం జరిగింది. ఈ సినిమాలో నేను రాసిన పాన్ గ్లోబ్ సాంగ్ లిరికల్ వీడియోను తనకెళ్ళభరణి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఒక సాంగ్, కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలుంది. జులై చివరి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా కథ మొత్తం డబ్బుకు సంబంధించిన అంశం చుట్టూ జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో మనం ఇంటినుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇంతకుముందు ఎవర్ని దోచుకోవాలో సెలెక్ట్ చేసుకొని వారిని దోచుకొనే వారు. ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాం ఓటు వేసి. అయితే ఇది పొలిటికల్ సినిమా కాదు. అన్ని రకాల ఎమోషన్స్ తో పాటు ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.
చిత్ర నిర్మాత బొడ్డు కోటేశ్వరరావు మాట్లాడుతూ, "నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో సినిమా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి" అన్నారు.
చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో నా సాటి కవి, దర్శకుడు శివనాగేశ్వరరావు రాసిన పాట చాలా బాగుంది. మారుతున్న తరానికి ప్రయోగాలు నచ్చుతాయి. మా అబ్బాయి ప్రణవ చంద్ర ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇంతకు ముందు 'ఏమో గుర్రం ఎగరావచ్చు' సినిమాలో చేశాడు. నా ఇద్దరు కొడుకులు దర్శకులు అవ్వాలని వర్క్ చేస్తున్నారు. ఐతే కో డైరెక్టర్ గా చేస్తున్న ప్రణవ్ కు శివ నాగేశ్వరావు ఈ సినిమాలో హీరోగా చేసే అవకాశం ఇచ్చారు. మంచి కామెడీతో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి" అన్నారు.
గేయ రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ, "బాలు గారు పాడినన్ని పాటలు ఇప్పటి వరకు ఎవరూ పాడలేదు. మేము అయన పాటలు వింటూనే పెరిగాం. తన పాటలు ఒక బాషకు పరిమితం కాకుండా ప్రతి బాషలో తన పాటలు ఉండడం గొప్ప విశేషం. శివనాగేశ్వరరావు తీసిన చాలా సినిమాలకు నేను నెగిటివ్ రివ్యూలు రాసినా దానిని స్పోర్టివ్ గా తీసుకొనేవారు. అటువంటిది ఇప్పుడు తన సినిమాకు నేను పాటలు రాయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి" అన్నారు.
హీరో ప్రణవచంద్ర మాట్లాడుతూ, "క్రిష్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేస్తున్న నాకు తన సినిమాలో హీరోగా చేసే అవకాశమిచ్చారు శివనాగేశ్వరరావు గారు. నా కో ఆర్టిస్ట్ మాళవిక కూడా చాలా చక్కగా నటించింది. అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి వంటి వారితో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.
![]() |
![]() |