![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ - సెంటిమెంట్ చిత్రాల స్పెషలిస్ట్ ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో ముచ్చటగా మూడు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో 1998 నాటి `పవిత్ర ప్రేమ` ఒకటి. `ఇన్ స్పెక్టర్ ప్రతాప్` (1988) వంటి విజయవంతమైన చిత్రం తరువాత బాలయ్య - సుబ్బయ్య కాంబోలో వచ్చిన ఈ సినిమా.. మ్యూజికల్ గా మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ ముంగిట చెప్పుకోదగ్గ విజయం అందుకుంది. మద్యం మత్తులో తను చేసిన ఓ తప్పుని మాణిక్యం (బాలకృష్ణ) ఎలా సరిదిద్దుకున్నాడు? అనే పాయింట్ తో `పవిత్ర ప్రేమ` తెరకెక్కింది. ఇందులో బాలయ్యకి జంటగా లైలా, రోషిణి నటించగా.. కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, మల్లికార్జున రావు, పొన్నాంబళం, మోహన్ రాజ్, నర్రా వెంకటేశ్వరరావు, ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్, సుత్తి వేలు, అన్నపూర్ణ, సుమ, రక్ష ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కోటి స్వరకల్పనలో రూపొందిన గీతాలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, భువనచంద్ర, గురుచరణ్ సాహిత్యమందించారు. ``ఓ రంగా శ్రీరంగా``, ``గూగుమ్మ గూగమ్మ``, ``జింగుచక్క జింగాంగు``, ``చైత్రమా రా రా``, ``చినుకులే ఒక్కటై``, ``దిల్ వాలా దీవానా``, ``ఓ దైవమా``.. ఇలా ఇందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై వి. శ్రీనివాసరెడ్డి నిర్మించిన `పవిత్ర ప్రేమ`.. 1998 జూన్ 4న విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ చిత్రం 24 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |