![]() |
![]() |

తనీష్ సరసన హీరోయిన్‌గా నటించిన 'మేం వయసుకు వచ్చాం' మూవీ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ఢిల్లీ గాళ్ నీతి టేలర్ పెళ్లయిపోయింది. తన స్కూల్‌మేట్ లెఫ్టినెంట్ పరీక్షిత్ బవాతో ఆమె వివాహం జరిగింది. 2019 ఆగస్ట్ 13న ఢిల్లీలో వైభవంగా జరిగిన నిశ్చితార్ధ వేడుకలో ఆ ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. దానికి కొద్ది నెలల ముందే ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో నీతి టేలర్ కొన్ని పిక్చర్లను పోస్ట్ చేసింది. అందులో ఆమె పెళ్లికూతురు డ్రస్‌లో ఉంది. అయితే ఆ డ్రస్ ఎందుకు వేసుకుందో ఆమె వెల్లడించలేదు. దాంతో ఏదైనా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలేమోనని చాలా మంది భావించారు.

ఎట్టకేలకు ఇప్పుడు.. తమ పెళ్లి 2020 ఆగస్ట్ 13న జరిగిపోయిందని వెల్లడించింది నీతి. గుర్గావ్‌లోని గురుద్వారాలో సన్నిహితుల మధ్య జరిగిందనీ, తమ పెళ్లికి తమ తల్లిదండ్రులు, ఇతర సన్నిహిత కుటుంబసభ్యుల మాత్రమే హాజరయ్యారనీ ఆమె వెల్లడించింది. ఆగస్ట్ 13న పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం ఆ నెల 6వ తేదీనే తీసుకున్నామని చెప్పింది నీతి. హనీమూన్ సంగతి ఆ జంట ఇంకా ప్లాన్ చేసుకోలేదు. కరోనా ప్రభావం తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక అప్పుడు దాని గురించి ఆలోచిస్తామని నీతి తెలిపింది.

నిజానికి ఈ అక్టోబర్ నెలాఖరులో పెళ్లి చేసుకోవాలని మొదట అనుకున్నారంట. "కొవిడ్-19 పరిస్థితులు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించకపోవడంతో నిశ్చితార్ధం తేదీనే పెళ్లి చేసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. పరిస్థితులు మామూలయ్యాక అందరి సమక్షంలో వేడుక జరుపుకుంటాం" అని వెల్లడించింది నీతి. అంటే నిశ్చితార్ధం జరిగిన ఏడాదికి అదే రోజున పెళ్లి చేసుకున్నారన్న మాట.

తమ పెళ్లి జరిగిపోయిందని వార్తను ఓ వీడియో ద్వారా ఆమె షేర్ చేసింది. అందులో వివాహానికి సంబంధించిన అందమైన క్షణాలున్నాయి. "మిస్ నుంచి మిసెస్ దాకా నా జర్నీ పూర్తయింది. 13 ఆగస్ట్ 2020న పరీక్షిత్‌తో నా వివాహం జరిగిందని నా శ్రేయోభిలాషులందరికీ తెలియజేసుకుంటున్నా. కొవిడ్-19 మహమ్మారి త్వరలోనే తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం. అప్పుడు మేం భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటాం.. 2021లో అయితే బెటర్‌గా ఉంటుందనుకుంటున్నాం" అని ఆ వీడియోతో పాటు పోస్ట్ చేసింది నీతి.

త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన 'మేం వయసుకు వచ్చాం' చిత్రంలో ముస్లిం అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది నీతి. ఆ సినిమా హిట్టయింది. దాని తర్వాత 'పెళ్లి పుస్తకం', 'లవ్ డాట్ కామ్' సినిమాల్లో ఆమె నటించింది.

![]() |
![]() |