![]() |
![]() |

బిగ్ బాస్ 4 తెలుగు ప్రారంభమై నెల రోజులు గడిచిపోయాయి. ఓపెనింగ్ ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీతో అదరగొట్టి రానున్న రోజుల్లో రికార్డులు క్రియేట్ చేస్తుందనే నమ్మకాన్ని కలిగించింది. మూడో సీజన్‌ను హోస్ట్‌గా కింగ్ నాగార్జున విజయ పథంలో నడిపించడం, మునుపటి రెండు సీజన్లతో పోలిస్తే అత్యధిక టీఆర్పీని సాధించడంతో నాలుగో సీజన్‌ను కూడా ఆయన దిగ్విజయంగా నడిపిస్తారని అంతా భావించారు. అందుకే నాలుగో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. అయితే వారం తిరిగేసరికి అనూహ్య స్థాయిలో టీఆర్పీ పడిపోవడంతో నిర్వాహకులతో పాటు నాగ్‌ను కలవరపరచింది.
మొదటి వారంలో వీక్షకుల్ని అంతగా రంజింపచేయలేకపోయిన హౌస్‌మేట్స్‌లో ఒకవైపు నాగ్, మరోవైపు బిగ్ బాస్ హుషారు తీసుకొచ్చారు. గత సీజన్లకు భిన్నమైన టాస్కులతో వాళ్లలో కాక పుట్టించారు. దాంతో గేమ్‌లో నిలవాలని హౌస్‌మేట్స్ తీవ్రంగా తలపడుతూ రావడం షోకి ఊపు తెచ్చింది. రెండో వారం నుంచి టీఆర్పీ క్రమేణా పెరుగుతుండటంతో ప్రస్తుతం బిగ్ బాస్ 4 తెలుగు వీక్షకులను ఆకట్టుకుంటున్నట్లే కనిపిస్తోంది.
అయితే తాజాగా ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అది నాగార్జున కొద్ది రోజుల పాటు హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారనేదే ఆ న్యూస్. అవును. ఇంతకాలం కరోనా మహమ్మారి కారణంగా ఆయన సినిమా 'వైల్డ్ డాగ్' షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా సినిమాల షూటింగ్‌లు మొదలవుతూ వస్తున్నాయి. ఆ కోవలోనే 'వైల్డ్ డాగ్' షూటింగ్‌ను ఇటీవల పునఃప్రారంభించారు. నాగ్ కొద్ది రోజులు దాని షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఆ షూటింగ్ థాయిలాండ్‌లో దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కాబట్టి తప్పనిసరిగా నాగ్ అక్కడకు వెళ్లాల్సి ఉంది.
.jpg)
ఈ నేపథ్యంలో కొద్ది రోజులు ఆయన బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని వినిపిస్తోంది. గత సీజన్‌లోనూ ఇలాంటిదే జరిగింది. అప్పుడాయన తన బర్త్‌డేని విదేశాల్లో జరుపుకోడానికి వెళ్లడంతో ఆయన స్థానంలో రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు నాగ్ మూడు వారాల పాటు థాయిలాండ్‌లో షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అంటే.. మూడు వీకెండ్స్.. ఆరు ఎపిసోడ్స్‌లో ఆయన కనిపించరన్న మాట. మరి ఆయన స్థానంలో ఎవరు హోస్ట్‌గా వస్తారో.. వెయిట్ అండ్ సీ...
![]() |
![]() |