![]() |
![]() |

ఏ కమ్యూనిటీనైనా బాధపెట్టాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదనీ, తమవల్ల బాధపడ్డవారిని క్షమించమని కోరుతున్నాననీ 'జై భీమ్' డైరెక్టర్ టి.యస్. జ్ఞానవేల్ చెప్పాడు. లాయర్ చంద్రుగా సూర్య నటించిన 'జై భీమ్' మూవీ నవంబర్ 1న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ, తెలుగు సహా పలు భాషల్లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ సినిమాలో తమ జాతిని చెడుగా చూపించారంటే వన్నియార్ సంగమ్, ఆ కులానికి చెందిన పలువురు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు దిగారు.
ఈ సినిమాని తీసేటప్పుడు ఏ వ్యక్తిని కానీ లేదా ఏ కులాన్ని కానీ రవ్వంత కూడా బాధపెట్టాలని ఏమాత్రం అనుకోలేదని వెల్లడించిన జ్ఞానవేల్, మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను అని చెప్పాడు. ఈ కాంట్రవర్సీలో 'జై భీమ్' హీరో, ప్రొడ్యూసర్ సూర్య చిక్కుకోవడంపై అతను ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమాలో కిరాతకుడైన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రకు 'గురు'మూర్తి అనే పేరు పెట్టడం, పోలీస్ స్టేషన్‌లో అమాయకులను చిత్రహింసలు పెట్టేటప్పుడు బ్యాగ్రౌండ్‌లో వన్నియార్ కులానికి చెందిన అగ్ని ప్రజ్వరిల్లుతున్న కుండ చిహ్నం ఉన్న క్యాలెండర్ ఉండటం ఆ కులానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
బ్యాగ్రౌండ్‌లో ఉన్న క్యాలెండర్‌లో ఉన్న చిహ్నం ఒక కమ్యూనిటీని ప్రతిబింబిస్తుందనే విషయం తనకు తెలీదని కూడా జ్ఞానవేల్ తెలిపాడు. షూటింగ్ టైమ్‌లో కానీ, పోస్ట్ ప్రొడక్షన్‌లో కానీ, కొద్ది సెకన్లు మాత్రమే కనిపించే ఆ క్యాలెండర్ తమ దృష్టికి రాలేదని అతను చెప్పాడు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాకముందు సినిమాను పలువురికి చూపించామనీ, వారిలో ఎవరి దృష్టికీ ఆ విషయం రాలేదని కూడా అతను వెల్లడించాడు.
"ఆ క్యాలెండర్‌ను చూపించిన దానిపై సూర్యను బాధ్యునిగా చూపిస్తూ, ఆయనపై నిరసనలకు దిగడం దురదృష్టకరం. ఒక డైరెక్టర్‌గా దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత నాదే" అని స్పష్టం చేశాడు జ్ఞానవేల్.
'జై భీమ్' సినిమా వన్నియార్ కులం గౌరవమర్యాదలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని ఆరోపిస్తూ, తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ నవంబర్ 15న దర్శకునితో పాటు 'జై భీమ్' నిర్మాతలుగా సూర్య, జ్యోతిక దంపతులకు కూడా వన్నియార్ సంగమ్ లీగల్ నోటీస్ పంపింది.
![]() |
![]() |