![]() |
![]() |

కౌన్ బనేగా క్రోరోపతి 12 ఒక వివాదంలో చిక్కుకుంది. మనుస్మృతికి సంబంధించిన ప్రశ్నకు సంబంధించి హోస్ట్ అమితాబ్ బచ్చన్, ఆ షో నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆ ప్రశ్న హిందూ మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని సోషల్ మీడియాలో చాలా మంది పేర్కొన్నారు. ఈ ప్రశ్న అక్టోబర్ 30న కరంవీర్ ఎపిసోడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్, నటుడు అనుప్ సోని అతిథులుగా పాల్గొన్నారు. రూ. 6.40 లక్షల విలువ చేసే ఆ ప్రశ్న: 1927 డిసెంబర్ 25 న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన అనుచరులు ఏ గ్రంథం కాపీలను తగలబెట్టారు? ఆప్షన్స్: (ఎ) విష్ణు పురాణం (బి) భగవద్గీత (సి) రుగ్వేదం (డి) మనుస్మృతి.
అమితాబ్ మాట్లాడుతూ, "1927 లో కుల వివక్షను, అంటరానితనాన్ని సైద్ధాంతికంగా సమర్థించే పురాతన హిందూ గ్రంథమైన మనుస్మృతిని అంబేద్కర్ ఖండించారు, దాని కాపీలను తగలబెట్టారు." అని చెప్పారు. ఇది చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పించింది. అమితాబ్ బచ్చన్, సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లపై చర్యలు తీసుకోవాలని లాతూర్ జిల్లాలోని ఆసా ప్రాంతానికి చెందిన బిజెపి శాసనసభ్యుడు అభిమన్యు పవార్ కోరారు. ఆయన తన పోలీసు ఫిర్యాదులో, “నాలుగు ఆప్షన్స్ కూడా హిందూ మతానికి సంబంధించినవే. ఈ ప్రశ్న వెనుక ఉద్దేశ్యం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని స్పష్టమైంది. ” అని పేర్కొన్నారు.
అభిమన్యు పోలీసులకు రాసిన తన లేఖ కాపీని ట్విట్టర్‌లో పంచుకున్నారు. "హిందువులను అవమానించడానికి, సామరస్యంగా జీవిస్తున్న హిందువులు, బౌద్ధుల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్నం జరిగింది" అని ఆయన రాశారు.
![]() |
![]() |