![]() |
![]() |

భర్త రాజ్ కుంద్రా, ఇద్దరు పిల్లలతో హాయిగా సాంసారిక జీవితాన్ని ఆస్వాదిస్తోన్న శిల్పా శెట్టి ఆరేళ్ల విరామంతో ఒకేసారి రెండు హిందీ సినిమాలు చేస్తున్నారు. ఒకటి.. సబ్బీర్ ఖాన్ డైరెకక్షన్‌లో చేస్తోన్న 'నికమ్మా' కాగా, మరొకటి ప్రియదర్శన్ రూపొందిస్తోన్న 'హంగామా 2'. వృత్తిపై శిల్పా అంకిత భావం అసాధారణం అని ఆమెతో సన్నిహితంగా మెలిగిన వాళ్లందరికీ తెలుసు. ఒకప్పుడు కాలు కదపలేనంత నిస్సహాయ స్థితిలో కూడా ప్రేక్షకులకు కనువిందు చేసే డాన్స్ సీక్వెన్స్ చేసి వహ్వా అనిపించుకున్నారు.
'చోర్ మచాయే షోర్' సినిమాలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయువుపట్టయిన ఇక డాన్స్ సీక్వెన్స్‌లో ఆమె పాల్గొనాల్సి ఉంది. కానీ అనుకోకుండా వచ్చిన తీవ్రమైన కాలినొప్పి డాన్స్‌కు సహకరించలేదు. విషయం తెలిస్తే ఎవరూ ఆమె డాన్స్ చేయడానికి ఒప్పుకోరు. కానీ దానివల్ల షెడ్యూల్ దెబ్బతింటుంది. తద్వారా నిర్మాతకు నష్టం కలుగుతుంది. దీనికి ఇష్టపడని శిల్ప అలవికాని కాలినొప్పి శరీరాన్ని బాధిస్తున్నా జనరంజక నృత్యాన్ని ఎలాంటి తేడా లేకుండా చేసి యూనిట్ మెంబర్స్‌తో వహ్వా అనిపించుకున్నారు.
ఆ టైమ్‌లో ఆమెకు అవకాశాలు వెల్లువగా వచ్చాయి. సన్నీ డియోల్ సొంత చిత్రం 'ఇండియన్'లో, అనిల్ కపూర్ సొంత సినిమా 'బధాయీ హో బధాయీ'లోనే కాకుండా కర్జ్, రిష్తే, హత్యార్, జంగ్ లాంటి సినిమాల్లో ఆమెకు చాన్సులు వచ్చాయి. దీనికి కారణం సల్మాన్ ఖాన్ రికమండేషన్ అంటూ బాలీవుడ్‌లో గుసగుసలు బాగా వినిపించాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో దీన్ని ఖండించారు శిల్పా శెట్టి. అందులో ఏమాత్రం నిజం లేదని ఆమె చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే.. అప్పట్లో సల్మాన్ సినిమాల్లో చాలా వాటిలో తానే హీరోయిన్‌గా కనిపించాలనీ, కానీ అలాంటిదేమీ జరగలేదనీ ఆమె అన్నారు. ఆ టైమ్‌లో ఆయనతో ఒక సినిమాలోనే నటించానని ఆమె చెప్పారు. కాకపోతే 'ధడ్కన్' సినిమా టైమ్‌లో వచ్చిన గ్యాప్ తర్వాత వెంటనే సల్మాన్ సహకారంతో ఆయనతో ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అది తప్ప సల్మాన్ ఎప్పుడూ తనను వేరే సినిమాలకు రికమెంట్ చేయలేదని స్పష్టం చేశారు శిల్ప.
ఆ టైమ్‌లోనే ఆమె తెలుగు సినిమాల్లో నటించారు. నాగార్జునతో ఆజాద్, బాలకృష్ణతో భలేవాడివి బాసూ సినిమాలు చేసింది అప్పుడే.
![]() |
![]() |