![]() |
![]() |

పాపులర్ బాలీవుడ్ యాక్టర్, రన్, భోపాల్ ఎక్స్‌ప్రెస్, రఘు రోమియో, గులాబో సితాబో తదితర చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన విజయ్ రాజ్‌ను గోండియా పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తను నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సందర్భంలో అక్కడి సిబ్బందిలో ఓ మహిళను వేధించాడనేది ఆయనపై ఆరోపణ. ఏదేమైనా ఈ కేసులో ఆయన బెయిల్‌ను పొందినట్లు సమాచారం.
మహారాష్ట్రలోని గోండియాలో విద్యా బాలన్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'షేర్ని' షూటింగ్ జరుగుతోంది. గత 15 రోజులుగా ఆ సినిమా షూటింగ్ నిమిత్తం గోండియాలోని గేట్‌వే హోటల్‌లో విజయ్ రాజ్ బస చేశారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో షూటింగ్ సందర్భంగా, అలాగే గోండియాలోని హోటల్‌లో విజయ్ రాజ్ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేశారని 30 సంవత్సరాల ఆ యూనిట్ మెంబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆయనను పట్టుకొని అరెస్ట్ చేశారు.
పర్యవసానంగా, గోండియాలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (ఏ, డి) కింద విజయ్ రాజ్‌పై కేసు నమోదైంది. ప్రొఫెషనల్‌గా విజయ్ రాజ్ 50కి పైగా బాలీవుడ్ సినిమాల్లో నటించారు. సూపర్ హిట్టయిన 'రన్' మూవీలో చేసిన "కౌవా బిర్యానీ" సీన్‌తో బాగా పాపులర్ అయ్యాడు. 2014లో విడుదలైన 'క్యా దిల్లీ క్యా లాహోర్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. విజయ్ రాజ్ వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారన్న వార్త బాలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది.
![]() |
![]() |