![]() |
![]() |

అత్యధిక చిత్రాల నిర్మాతగా డాక్టర్ డి. రామానాయుడు ప్రపంచ రికార్డ్ సృష్టించడం, గిన్నెస్ బుక్‌లోకి ఎక్కడం తెలుగు చిత్రసీమకు గర్వకారణం. 2015లో తాను మృతి చెందేనాటికి ఆయన దేశంలో ఎన్ని భాషల్లో సినిమాలు నిర్మాణమవుతున్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించి మరో అరుదైన ఘనతను సాధించారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన 117 సినిమాలు నిర్మించారు. అయితే నిర్మాతగా తన వందో చిత్రాన్ని చిరంజీవి, వెంకటేశ్ కలయికలో మల్టీస్టారర్ నిర్మించాలని ఆయన కలలు కన్నారు. కానీ సరైన స్క్రిప్ట్ రాకపోవడం వల్లనో, మరో కారణం చేతనో అది వాస్తవ రూపం ధరించలేదు. ఆ తర్వాత కూడా చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటించలేదు.
కానీ చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్‌తో నటించారు వెంకటేశ్. అది.. 'గోపాల గోపాల' సినిమా. హిందీ హిట్ ఫిల్మ్ 'ఓ మై గాడ్'కు రీమేక్ అయిన ఆ సినిమాలో వెంకటేశ్ హీరోగా నటిస్తే, మనిషి రూపం దాల్చిన శ్రీకృష్ణునిగా ఒక స్పెషల్ రోల్‌ను పవన్ కల్యాణ్ చేశారు. దీన్ని నిర్మించింది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థే. సురేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని రామానాయుడు సమర్పించారు. 2015 జనవరి 10న ఈ సినిమా విడుదల కాగా, ఆ తర్వాత కొద్ది రోజులకే 78 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 18న రామానాయుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.
![]() |
![]() |