![]() |
![]() |

డైనమిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో పేరుపొందిన పూరి జగన్నాథ్ డైరెక్టర్‌గా సోమవారం (ఏప్రిల్ 20)తో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అవును. పవన్ కల్యాణ్ హీరోగా ఆయన రూపొందించిన తొలి చిత్రం 'బద్రి' సరిగ్గా ఇదే రోజు 2000 సంవత్సరంలో విడుదలైంది. తొలి చిత్రంతోటే డైరెక్టర్‌గా తనేమిటో ఇటు ఇండస్ట్రీకి, అటు ఆడియెన్స్‌కూ తెలియజేశారు పూరి. రెండో సినిమా 'బాచి' ఫ్లాపైనా, రవితేజతో చేసిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.
'ఇడియట్' సినిమాతో హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన పూరి క్రియేటివ్ మైండ్ నుంచి.. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, దేశముదురు, చిరుత, ఏక్ నిరంజన్, బిజినెస్‌మ్యాన్, కెమెరామన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, హార్ట్ ఎటాక్, టెంపర్, జ్యోతిలక్ష్మి.. లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన 'పోకిరి' ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం.
అలాగే రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి తీసిన మునుపటి సినిమా 'ఇస్మార్ట్ శంకర్' డైరెక్టర్‌గా ఆయన స్టామినా ఏమిటో మరోసారి నిరూపించింది. పూరిలో మునుపటి డైనమిజం కనిపించడం లేదని విమర్శలు వస్తున్న సమయంలో బ్లాక్‌బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్'తో ఆ విమర్శలకు చెక్ చెప్పారు పూరి. ఏ సినిమానైనా తక్కువ టైమ్‌లో పూర్తిచేసి, నిర్మాతల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ 20 ఏళ్లలో 34 సినిమాలు డైరెక్ట్ చేశారు. వాటిలో రెండు హిందీ, రెండు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్‌ను డైరెక్ట్ చేసిన ఆయన 'బుడ్డా.. హోగా తేరా బాప్' సినిమా రూపొందించారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండను బాక్సర్‌గా చూపిస్తూ ఓ పాన్ ఇండియా ఫుల్ యాక్షన్ మూవీని పూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతోనూ ఆయన మరో బ్లాక్‌బస్టర్‌ను ఇండస్ట్రీకి అందిస్తారని ఆశిద్దాం.
![]() |
![]() |