![]() |
![]() |

కరోనా వైరస్ మనవాళికి గుణపాఠాలు నేర్పిందనీ, మనం అనేక మంచి అలవాట్లను నేర్చుకోవడంతో పాటు, కుటుంబ బంధాల్ని బలోపేతం చేసుకున్నామనీ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బయట కాలుష్యం లేకపోవడంతో రోగాలు తగ్గాయని ఆయన చెప్పారు. ఒక టీవీ చానల్‌తో మాట్లాడిన ఆయన, "కరోనా మహమ్మారి వల్ల కలిగేది తాత్కాలిక నష్టం. దీన్ని భరించక తప్పదు. ఈ సమయంలో కూడా ఏ రకంగా మనల్ని మనం ఎంటర్‌టైన్ చేసుకోవాలి, ఏ రకంగా ఒకరికొకరు సహాయంగా ఉండాలి, ఏ రకంగా సమయాన్ని వెచ్చించాలి అనే విషయంలో మన వంతు ప్రయత్నం మనం చేసుకోవాలి. మనమే నష్టపోతున్నాం, మనకే ఏదైనా అయిపోతోంది అనే వ్యధ వృథా" అని అన్నారు.
ఈ క్రైసిస్‌లో పరిశుభ్రతను అందరం అలవాటు చేసుకున్నామని చిరంజీవి చెప్పారు. "దీనివల్ల వేరే వైరస్‌లు చేరకుండా, వేరే జబ్బులు రాకుండా మనం అరికట్టగలిగాం. ప్రకృతిలోని అందాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. పొల్యూషన్ లేకపోవడంతో ఎలర్జీలకు, కొన్ని రోగాలకు దూరంగా ఉండగలుగుతున్నాం. అన్నింటికీ మించి ఫ్యామిలీ బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. తల్లిదండ్రులు - పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య బంధం గట్టిపడింది. ఆ బంధాల్ని కొత్తగా అనుభవిస్తున్నారనిపిస్తోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
దారి తప్పుతున్న, గతి తప్పుతున్న మానవాళికి ఒక చిన్న హెచ్చరిక లాగా, చిన్న చురక లాగా భగవంతుడు ఈ కరోనాను అంటించాడేమో అనుకుంటున్నా అని ఆయన అన్నారు. ఇప్పుడు మనకు అలవడిన ఈ అలవాట్లను కొనసాగించ గలిగితే చాలావరకు హాస్పిటల్స్‌కు వెళ్లాల్సిన అవసరం రాదని ఆయన చెప్పారు.
![]() |
![]() |