![]() |
![]() |

'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళిని చిరంజీవి ఆకాశానికెత్తేశారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారంటూ ప్రశంసించిన ఆయన రాజమౌళిని ఘనంగా సన్మానించారు. అంతేకాదు తాను ఆచార్య సినిమా చేయడానికి కూడా రాజమౌళినే కారణమని చిరంజీవి అన్నారు.
"చరణ్.. రాజమౌళి గారి సినిమా, కొరటాల శివ గారి సినిమా ఒకేసారి చేసే పరిస్థితి వచ్చింది. రాజమౌళితో సినిమా ఉంటే వేరే సినిమాలు చేయడం కుదరదు. ఇలాంటి సమయంలో శివతో సినిమా ఎలా చేయాలి, ఏం చెప్పాలని చరణ్ సతమతమవుతున్నాడు. అప్పుడు నేను సింపుల్ గా తేల్చేస్తాను చరణ్.. ఓసారి శివ గారిని ఇంటికి పిలిపించు అన్నాను. అలా ముగ్గురం కూర్చొని మాట్లాడుతుండగా.. మీరు చరణ్ తో సినిమా చేస్తున్నారు కదా.. ఒకవేళ చరణ్ బదులు నేను చేస్తానంటే మీ ఫీలింగ్ ఏంటని శివని అడిగాను. వెంటనే ఆయన చాలా ఎగ్జైట్ అవుతూ.. చరణ్ తో ఎప్పుడైనా చేయొచ్చు సార్, మీరు చేస్తానంటే అంతకంటే కావాల్సి ఏముంది, వెంటనే స్క్రిప్ట్ రెడీ చేస్తానని అన్నారు. అప్పుడు చరణ్ తో నువ్వు రాజమౌళి సినిమా చేసుకో, నేను శివతో సినిమా చేస్తానని అన్నాను. అలా ఈ సినిమా స్టార్ట్ అయింది" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
"అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో మరో సమస్య వచ్చింది. కొన్ని నెలల తర్వాత కథ బాగా వచ్చింది. అందులో ఓ మంచి క్యారెక్టర్ ఉంది. చిన్నది అనుకున్నది అలా అలా పెద్దది అయిపోయింది. అందులో చరణ్ అయితే పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు. దీంతో మళ్ళీ మొదటికి వచ్చింది. అక్కడ రాజమౌళి గారేమో తలుపులు బిగించేసుకున్నారు. నాకు వినపడట్లేదు అంటున్నారు. అప్పుడు లేడీ సెంటిమెంట్ ఉపయోగించాను. మా(నన్ను, చరణ్) ఇద్దరిని కలిపి ఓ సినిమాలో చూడాలని సురేఖ(చిరు భార్య) కోరిక రాజమౌళి గారు. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందో.. వాడి తల్లి కోరిక ఎప్పుడు తీరుతుందో అన్నాను. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమా గ్యాప్ లో ఆచార్య చేయడానికి చరణ్ ని వదిలారు. పరోక్షంగా ఈ సినిమాకి రాజమౌళి ఎంతో చేశారు. ఆయన ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా రావడం సంతోషంగా ఉంది." అని చిరంజీవి అన్నారు.
![]() |
![]() |