![]() |
![]() |

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'కార్తికేయ' సినిమా 2014 లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా నిఖిల్-చందు కాంబినేషన్ లో 'కార్తికేయ-2' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'స్వామిరారా', 'కార్తికేయ' సినిమాల నుంచి విభిన్న సినిమాలు చేస్తూ అలరిస్తున్న నిఖిల్ నటిస్తున్న 'కార్తికేయ-2'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'కార్తికేయ-2' సినిమాను జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. విభిన్నంగా డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండల మధ్యలో నడుస్తూ నిఖిల్ కనిపిస్తున్నాడు. అంతేకాదు ఆ కొండల మధ్య ఉన్న ఖాళీ భాగం నెమలి పించెం ధరించిన శ్రీకృష్ణుడిని పోలి ఉండటం విశేషం. 'కార్తికేయ'లో సుబ్రమణ్య స్వామి గుడి నేపథ్యంలో కథని చూపించగా.. ఇప్పుడు 'కార్తికేయ-2'లో శ్రీకృష్ణుడి నేపథ్యంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'కార్తికేయ-2'లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
![]() |
![]() |