![]() |
![]() |

మోహన్‌బాబు టైటిల్ రోల్ పోషించగా, డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసిన 'సన్ ఆఫ్ ఇండియా' ఈ ఏడాది ఫిబ్రవరి 18న విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాలో మోహన్‌బాబు పాత్ర తప్ప అనేక ఇతర పాత్రలు ముఖం కనిపించకుండా మాట్లాడటం, చివరలో మాత్రమే వాళ్ల ఫేసులు కనిపించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇదే విషయాన్ని సినిమా రిలీజ్‌కు ముందే పబ్లిసిటీ ఇచ్చినట్లయితే ఫలితం వేరేగా వచ్చేదని సీనియర్ రైటర్ తోటపల్లి సాయినాథ్ అభిప్రాయపడ్డారు. 'సన్ ఆఫ్ ఇండియా'కు డైలాగ్స్ రాసింది ఆయనే.
తెలుగువన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "సన్నాఫ్ ఇండియా కథ డైమండ్ రత్నబాబుది, స్క్రీన్‌ప్లే మోహన్‌బాబు రాస్తే, నేను డైలాగ్స్ రాశాను. ముగ్గురం తిరుపతిలో 25 రోజుల పాటు కూర్చొని ఈ సినిమా స్క్రిప్టుపై వర్క్ చేశాం. అది కరోనా ప్రభావం బాగా ఉన్న టైమ్. ఏ ఆర్టిస్టును అడిగినా షూటింగ్ చేయడానికి భయపడిపోయారు. బతికితే చాలు అనుకునేంత పరిస్థితి ఉందప్పుడు. ప్రాజెక్టునే డ్రాప్ చేసేద్దాం అనుకున్నాం." అని ఆయన వెల్లడించారు.
అప్పుడు తమకు వచ్చిన ఒక ఆలోచన గురించి ఆయన ప్రస్తావించారు. "ఒకప్పుడు సునీల్ దత్ హిందీలో 'యాదే' అనే సినిమా తీశాడు ఏక పాత్రతో. అలాగే నాటక రంగంలో మాయల ఫకీరు ఏకపాత్ర ఉంది. సంగు ఉండదు, దెయ్యం ఉండదు. కానీ ఆ పాత్రలు ఉన్నట్లుగా మాయల ఫకీరు అన్నీ చేస్తుంటాడు. ఏకపాత్ర అనేది స్టేజ్ డ్రామాకు బాగా తెలుసు. అనేక ఏకపాత్రాభినయాలను మనం స్టేజ్ మీద చూశాం. అలాంటిది సినిమాలో ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. వెంటనే మోహన్‌బాబు అలా చేద్దామన్నారు. ఆయన కనపడతాడు, మిగతా 22 పాత్రలూ వినిపిస్తుంటాయ్. లాస్ట్ సీన్‌లో మాత్రమే ఆ పాత్రధారులు కనిపిస్తారు. టీవీ జర్నలిస్టులుగా కనిపించే వెన్నెల కిశోర్, అలీ, సునీల్ లాంటివాళ్లు మాత్రం టీవీలో కనిపిస్తుంటారు. నిజానికి ఇలా చేస్తున్నామని రిలీజ్‌కు ముందుగానే అనౌన్స్ చేద్దామనుకున్నాం." అని ఆయన చెప్పారు.
తెలుగు చలనచిత్ర రంగంలో ఏకపాత్ర ప్రయోగం గతంలో ఎప్పుడూ చెయ్యలేదని సాయినాథ్ తెలిపారు. "ఈ సినిమాతో ఆ ప్రయోగం చేస్తున్నామని ముందుగా చెప్తే అది సినిమాకు నెగటివ్ అవుతుందేమోనని అనుకొని ఆగాం. నిజానికి అలా పబ్లిసిటీ ఇచ్చుంటే ఎలా ఉండేదో తెలీదు. సినిమా ప్రారంభంలో టైటిల్ కార్డ్స్ పడే ముందే ఈ విషయం చెప్పాం. అయితే 'ఏంట్రా ఫేసులు కనిపించడం లేదు, వెనుక నుంచి చూపిస్తున్నారు, కక్కుర్తిపడి తక్కువ బడ్జెట్‌తో చేశారు' అని జనం అనుకున్నారు తప్ప, ఇదొక ప్రయోగమనీ, కరోనా వల్ల ఇలా చేశామనీ క్లారిటీగా జనానికి చేరలేదు. సినిమాని రత్నబాబు చాలా బాగా తీశాడు. నిజంగా చాలా సాహసం చేశాడు. అది ముందే చెప్పుకొని ఉంటే అద్భుతంగా ఉండేదనేది నా ఫీలింగ్. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే అది మిస్‌ఫైర్ అయ్యింది." అని ఆయన చెప్పుకొచ్చారు.
![]() |
![]() |