![]() |
![]() |

`ద్యాముడా` (దేవుడా) అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండితెరపై సందడి చేసిన చిత్రం `రేసు గుర్రం`. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ఈ సినిమాలో బన్నీకి జంటగా శ్రుతి హాసన్ నటించగా.. శ్యామ్, సలోని, బ్రహ్మానందం, అలీ, రవికిషన్, పవిత్రా లోకేశ్, ప్రకాశ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ళ భరణి, ప్రగతి, కోట శ్రీనివాసరావు, శ్రీనివాస రెడ్డి, సాయాజీ షిండే, రాజీవ్ కనకాల, పరుచూరి వెంకటేశ్వర రావు, రఘుబాబు, సుడిగాలి సుధీర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. కైరా దత్ స్పెషల్ సాంగ్ లో ఎంటర్టైన్ చేసింది.
వక్కంతం వంశీ అందించిన కథ విషయానికి వస్తే.. రామ్ ప్రసాద్ (శ్యామ్), లక్ష్మణ్ ప్రసాద్ అలియాస్ లక్కీ (అల్లు అర్జున్) అన్నదమ్ములు. చిన్నప్పట్నుంచి టామ్ అండ్ జెర్రీ తరహాలో ఇద్దరూ పోట్లాడుకుంటుంటారు. ఇదిలా ఉంటే, ఏసీపీ అయిన రామ్ ఓ ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఈ క్రమంలో.. తన అన్నని కాపాడుకోవడానికి లక్కీ ఏం చేశాడు? అన్నదే `రేసు గుర్రం` చిత్రం. ఈ సినిమాకి బన్నీ నటన - నర్తనం ప్రధాన బలం కాగా, స్పందన పాత్రలో శ్రుతి హాసన్ - కిల్ బిల్ పాండేగా బ్రహ్మానందం అభినయం కూడా ప్లస్ గా నిలిచాయి.
యువ సంగీత సంచలనం తమన్ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``సినిమా చూపిస్తా మామ`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``బూచాడే``, ``రేసు గుర్రం``, ``స్వీటీ``, ``గల గల``, ``డౌన్ డౌన్`` కూడా రంజింపజేశాయి. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు నిర్మించిన `రేసు గుర్రం`.. `ఉత్తమ హాస్య నటుడు`, `ఉత్తమ అనువాద కళాకారుడు` (పి. రవిశంకర్) విభాగాల్లో `నంది` పురస్కారాలను, `ఉత్తమ నటుడు`, `ఉత్తమ నటి`, `ఉత్తమ గాయకుడు` (సింహా - ``సినిమా చూపిస్త మావ``) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకుంది. 2014 ఏప్రిల్ 11న విడుదలై ఘనవిజయం సాధించిన `రేసు గుర్రం`.. నేటితో 8 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |