![]() |
![]() |

యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందించిన RRR మూవీ కలెక్షన్లు ఏడో రోజు తెలుగునాట బాగా తగ్గిపోయాయి. విడుదలైన ఐదు రోజుల వరకు సూపర్బ్ కలెక్షన్లను రాబట్టిన ఈ మూవీ ఆరో రోజు నుంచీ బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో RRR ఏడో రోజు వసూలు చేసింది రూ. 7.48 కోట్ల షేర్ మాత్రమే. దాంతో తొలివారం ముగిసే నాటికి ఈ సినిమా తెలుగునాట వసూళ్లు రూ. 187.65 కోట్ల (షేర్)కు చేరుకున్నాయి. తెలంగాణలో ఆరో రోజుకు బ్రేకీవెన్ సాధించిన RRR, ఏడో రోజు రాయలసీమలోనూ బ్రేకీవెన్ సాధించింది. ఆంధ్రా ఏరియాలోనే ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ సేవ్ కావాల్సి ఉంది.
ఏడో రోజు కలెక్షన్ల విషయానికొస్తే RRR ఐదో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఏడో రోజు కలెక్షన్ల విషయంలో 'అల.. వైకుంఠపురములో' రూ. 8.43 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, రూ. 8.30 కోట్లతో 'బాహుబలి 2' రెండో స్థానంలో, రూ. 7.90 కోట్లతో 'సైరా' మూడో స్థానంలో, రూ. 7.64 కోట్లతో 'సరిలేరు నీకెవ్వరు' నాలుగో స్థానంలో నిలిచాయి. ఆశించిన దానితో పోలిస్తే RRR వసూళ్లు బాగా తగ్గాయనేది నిజం.
అయితే మొదటి వారం కలెక్షన్ల విషయంలో RRR దే నంబర్ వన్ ప్లేస్. ఇప్పటివరకూ ఏడు రోజుల్లో ఈ మూవీ రూ. 187.65 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసి టాప్‌లో ఉండగా, రెండో స్థానంలో ఉన్న 'బాహుబలి 2' కలెక్ట్ చేసింది రూ. 117.92 కోట్ల షేర్ కావడం గమనించాల్సిన అంశం. ఆ తర్వాత స్థానాల్లో 'అల.. వైకుంఠపురములో' (రూ. 88.25 కోట్లు), 'సరిలేరు నీకెవ్వరు' (రూ. 84.82 కోట్లు), 'సైరా' (రూ. 84.49 కోట్లు) ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో RRR ప్రి బిజినెస్ విలువ రూ. 191 కోట్లు. ఇప్పటికే రూ. 187.65 కోట్లు వచ్చాయి. అంటే టోటల్ కలెక్షన్ల పరంగా బ్రేకీవెన్‌కు అతి సమీపంగా ఉంది. తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ ఇప్పటికే ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెట్టగా, రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు నేటి నుంచి ప్రాఫిట్‌ను రుచి చూడనున్నారు. ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లు కూడా రేపట్నుంచి లాభాలను అందుకోనున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
![]() |
![]() |