![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' సినిమాలో తన పాత్ర పట్ల బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అసహనం వ్యక్తం చేసిందని.. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో రాజమౌళిని అన్ ఫాలో చేయడమే కాకుండా, ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన పోస్ట్ లు డిలీట్ చేసిందని ప్రచారం జరిగింది. నిజానికి ఇన్ స్టాలో రాజమౌళిని ఆలియా ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉంది. కొన్ని ఆర్ఆర్ఆర్ పోస్ట్ లు డిలీట్ చేసిన మాట వాస్తవమే కానీ, ఆమె ఆర్ఆర్ఆర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీలవుతూ ఇన్ స్టాలో స్టోరీ కూడా పెట్టింది. అయినప్పటికీ ఈ ప్రచారం ఆగలేదు. దీంతో తాజాగా ఆలియా స్ట్రాంగ్ గా స్పందించి.. ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది.
అసలు సినిమాలో పాత్ర ఎలా ఉండబోతుంది, పాత్ర నిడివి ఎంత అనేవి ఆర్టిస్ట్ లకు ఎంతో కొంత ముందే అవగాహన ఉంటుంది. ఏ డైరెక్టర్ కూడా ఆర్టిస్ట్ కి మీరే మెయిన్ లీడ్ అని చెప్పి, ఆ తర్వాత 10-15 నిమిషాల పాత్రకి కుదించడు. పైగా 'ఆర్ఆర్ఆర్' విడుదలకి ముందే ఆలియా పాత్ర గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది సినిమా విడుదలయ్యాక తన పాత్ర చూసుకొని ఆలియా డిజప్పాయింట్ అయ్యే అవకాశం లేదు. కానీ సినిమా విడుదలైన మరుసటి రోజు నుంచి ఆలియా అలిగిందంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ స్టాలో స్టోరీ పెట్టిన ఆలియా.. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

"నాకు ఇన్ స్టాలో గందరగోళంగా ఎక్కువ వీడియోలు ఉండటం నచ్చదు. అందుకే నా ప్రొఫైల్ గ్రిడ్ నుంచి ఓల్డ్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు రీఅలైన్ చేస్తుంటాను. దానిని ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆపాదించి నేను టీమ్ పట్ల అసంతృప్తిగా ఉన్నానని ప్రచారం చేయకండి. ఆర్ఆర్ఆర్ ప్రపంచంలో భాగమైనందుకు నేను ఎప్పటికీ గ్రేట్ ఫుల్ గా ఫీలవుతాను. రాజమౌళి గారి దర్శకత్వంలో సీత పాత్ర పోషించడం.. తారక్, చరణ్ తో కలిసి నటించడం.. ఇలా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను ప్రేమిస్తాను. రాజమౌళి గారు మరియు టీమ్ ఎన్నో ఏళ్ళు, ఎంతో కష్టపడి ఇంత అద్భుతమైన సినిమాని రూపొందించారు. ఈ మూవీ గురించి ఏ విధమైన తప్పుడు ప్రచారం జరగడం నాకిష్టం లేదు. అందుకే క్లారిటీ ఇస్తున్నాను" అంటూ ఆలియా రాసుకొచ్చింది.
ఆలియా ఇన్ స్టాలో పెట్టిన స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేక్ న్యూస్ కి పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చావంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
![]() |
![]() |