![]() |
![]() |

పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన సీనియర్ డైరెక్టర్ శరత్ శుక్రవారం కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు హైదరాబాద్‌లో తను చికిత్స పొందుతున్న హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతివార్తతో టాలీవుడ్‌లో విషాదం అలముకుంది. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేసింది.
కృష్ణంరాజు, సుమన్ కాంబినేషన్‌తో ఆయన రూపొందించిన 'బావ బావమరిది' (1993), విజయశాంతి-శారద కాంబినేషన్‌తో తీసిన 'అత్తా కోడళ్లు' (1994), బాలకృష్ణతో తీసిన 'పెద్దన్నయ్య' (1997) లాంటి సినిమాలు, ఘన విజయం సాధించాయి. సుమన్‌తో ఆయన తీసిన హిట్ సినిమా 'పెద్దింటల్లుడు' (1991)తోటే హీరోయిన్‌గా నగ్మా టాలీవుడ్‌కు పరిచయమైంది. అల్లుడు అనే టైటిల్‌తో ఆయన పలు సినిమాలు తీశారు. కలెక్టర్ గారి అల్లుడు, చిన్న అల్లుడు, దొంగల్లుడు, హలో అల్లుడు, పెద్దింటల్లుడు లాంటివి వాటిలో ఉన్నాయి.
చాదస్తపు మొగుడు (1986), కులాల కురుక్షేత్రం (1987), బంధువులొస్తున్నారు జాగ్రత్త (1989), గడుగ్గాయి (1989), మామాశ్రీ (1990), అగ్నినక్షత్రం (1991), శ్రీమాన్ బ్రహ్మచారి (1992), కాలేజ్ బుల్లోడు (1992), కలెక్టర్ గారి అల్లుడు (1992), రథసారథి (1993), చిన్న అల్లుడు (1993), దొంగల్లుడు (1993), జైలర్ గారి అబ్బాయి (1994), హలో అల్లుడు (1994), భలే బుల్లోడు (1995), వంశానికొక్కడు (1996), సుల్తాన్ (1999), వంశోద్ధారకుడు (2000) తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
![]() |
![]() |