![]() |
![]() |

లోక నాయకుడు కమల్ హాసన్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `ఏక్ దూజే కే లియే` (1981) ఒకటి. తెలుగునాట అఖండ విజయం సాధించిన `మరో చరిత్ర` (1978)కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో.. మాతృకలో తను పోషించిన పాత్రనే హిందీలోనూ ధరించారు కమల్. అలాగే ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన కె. బాలచందర్.. రీమేక్ ని కూడా తెరకెక్కించారు. ఇదే సినిమాతో దక్షిణాది నటీమణులు రతి అగ్నిహోత్రి, మాధవి బాలీవుడ్ లో తొలి అడుగులేశారు. తెలుగు వెర్షన్ లో సరిత పోషించిన పాత్రలో రతి కనిపించగా.. మాతృకలో చేసిన భూమికనే హిందీలోనూ ధరించారు మాధవి.
లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ సంగీతమందించిన ఈ చిత్రానికి ఆనంద్ బక్షి సాహిత్యమందించారు. ఇందులోని పాటలన్నీ కూడా విశేష ప్రజాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. `తేరే మేరే బీచ్ మే` గీతం ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటతో `గాన గంధర్వుడు` ఎస్పీ బాలసుబ్రమణ్యం రెండోసారి `ఉత్తమ గాయకుడు`గా `జాతీయ` పురస్కారం అందుకున్నారు. అలాగే బెస్ట్ ఎడిటింగ్ (ఎన్.ఆర్. కిటూ), బెస్ట్ స్క్రీన్ ప్లే (కె. బాలచందర్), బెస్ట్ లిరిసిస్ట్ (ఆనంద్ బక్షి - తేరే మేరే బీచ్ మే) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులు దక్కాయి. ప్రముఖ దర్శకనిర్మాత ఎల్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1981 జూన్ 5న విడుదలైన మ్యూజికల్ సెన్సేషన్ `ఏక్ దూజే కే లియే`.. నేటితో 40 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |