![]() |
![]() |

తెలుగుచిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు గురువుకి తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. కొందరైతే.. గురువుని మించి విజయాలు చూసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే గురువు `ఇండస్ట్రీ హిట్` ఇచ్చిన తేదినే శిష్యుడు కూడా `ఇండస్ట్రీ హిట్` కొట్టిన సందర్భం మాత్రం అరుదు. అలాంటి అరుదైన గురుశిష్యులే.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. వారిద్దరి ఖాతాలో ఇండస్ట్రీ హిట్ ని చేర్చిన ఆ అరుదైన తేది.. ఏప్రిల్ 28. సరిగ్గా 40 ఏళ్ళ గ్యాప్ లో ఈ గురుశిష్యుల `ఇండస్ట్రీ హిట్` ముచ్చట చోటుచేసుకోవడం విశేషం.
కాస్త వివరాల్లోకి వెళితే.. కె. రాఘవేంద్రరావు కెరీర్ ని మేలిమలుపు తిప్పిన చిత్రం `అడవి రాముడు` (1977). మహానటుడు నందమూరి తారక రామారావు కాంబినేషన్ లో రాఘవేంద్రరావు రూపొందించిన తొలి సినిమా కూడా ఇదే. కన్నడ చిత్రం `గంధదగుడి` (1973) ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంతో దర్శకేంద్రుడి కెరీర్ గ్రాఫ్ నే మారిపోయింది. అనూహ్య విజయం సాధించిన ఈ సినిమాతో ఫస్ట్ `ఇండస్ట్రీ హిట్`ని కొట్టారాయన. రికార్డు స్థాయి వసూళ్ళు సాధించిన ఆ సినిమాతో టాలీవుడ్ లో `స్టార్ డైరెక్టర్` అవతారమెత్తారు. ఆపై ఎన్నో ఘనవిజయాలకు చిరునామాగా నిలిచారు. కె. రాఘవేంద్రరావు జాతకాన్నే మార్చేసిన ఆ `అడవి రాముడు`.. 1977 ఏప్రిల్ 28న విడుదలైంది.
కట్ చేస్తే.. 40 ఏళ్ళ తరువాత అంటే 2017లో అదే ఏప్రిల్ 28న మరో అద్భుతం సృష్టించారు రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళి. ఆ అద్భుతం పేరే.. `బాహుబలి - ది కంక్లూజన్`. అప్పటికే `మగధీర`, `బాహుబలి - ది బిగినింగ్` రూపంలో రెండు ఇండస్ట్రీ హిట్స్ చూసిన రాజమౌళికి ఇదో మూడో ఇండస్ట్రీ హిట్. అంతేకాదు.. ఇండియన్ సినిమాకే `ఇండస్ట్రీ హిట్`గా నిలిచింది `బాహుబలి - ది కంక్లూజన్`. ఈ సినిమాతో నేషనల్ వైడ్ `స్టార్ డైరెక్టర్` అవతారమెత్తారు జక్కన్న. విశేషమేమిటంటే.. `బాహుబలి` సిరీస్ కి దర్శకేంద్రుడు సమర్పకుడిగా వ్యవహరించడం.
మొత్తమ్మీద.. గురుశిష్యులిద్దరూ తెలుగు సినిమా స్థాయిని పెంచిన `ఇండస్ట్రీ హిట్స్`ని ఒకే తేదిన (ఏప్రిల్ 28) 40 ఏళ్ళ గ్యాప్ లో ఇవ్వడం అరుదైన రికార్డ్ అనే చెప్పాలి.
![]() |
![]() |