![]() |
![]() |

లోక నాయకుడు కమల్ హాసన్ - కళాతపస్వి కె. విశ్వనాథ్.. క్లాసిక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాంబినేషన్ ఇది. అంతే కాదు.. అవార్డుల పంట పండించే మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ కి చిరునామా కూడా. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ అభినయించిన ఆ చిత్రాలే.. `సాగర సంగమం` (1983), `స్వాతి ముత్యం` (1986), `శుభ సంకల్పం` (1996). వీటిలో మూడో సినిమా అయిన `శుభ సంకల్పం` విడుదలై నేటికి 26 ఏళ్ళు.
మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్మించిన ఈ సంగీతభరిత చిత్రంలో జాలరి పాత్రలో తనదైన నటనతో కనువిందు చేశారు కమల్. ఆయనకి జంటగా ఆమని నటించిన ఈ సినిమాలో ప్రియా రామన్, కె. విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ, రాళ్ళపల్లి, సాక్షి రంగారావు, వైష్ణవి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరవాణి కీరవాణి బాణీలతో రూపొందిన గీతాలన్నీ వీనులవిందు చేశాయి. ``సీతమ్మ అందాలు``, ``హైలెస్సో హైలెస్సో``, ``హరి పాదాన``, ``చినుకులన్నీ``.. అయితే ఎవర్ గ్రీన్ సాంగ్స్. `ఉత్తమ నటి` (ఆమని), `ఉత్తమ గుణచిత్ర నటుడు` (విశ్వనాథ్), `ఉత్తమ సహాయనటి` (వైష్ణవి), `ఉత్తమ గాయని` (శైలజ), `ఉత్తమ ఎడిటర్` (జి.జి. కృష్ణారావు) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ సంగీత దర్శకుడు` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకుంది `శుభ సంకల్పం`. 1996 ఏప్రిల్ 28న విడుదలైన `శుభ సంకల్పం`.. బుల్లితెరపై అడపాదడపా అలరిస్తూనే ఉంది.
![]() |
![]() |